కేంద్ర నాడీ వ్యవస్థలో భాగమైన మెదడు గురించి మనకు తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. అందుకే మనోవ్యాధికి మందులేదనే నానుడి కూడా ప్రాచుర్యంలో ఉంది. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు కూడా నెమ్మదిస్తుంది. కొన్ని కణాలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైంది అల్జీమర్స్. ఈ వ్యాధి వల్ల మతిమరపు వస్తుంది. చిన్న చిన్న అంశాలతో మొదలై.. చివరికి గతాన్ని సైతం మరిచిపోయేలా చేస్తుంది. కొందరికైతే ఒక్క సెకన్ ముందు ఏం జరిగిందో కూడా గుర్తుండదు.


ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడుతున్న వారిలో 50 నుంచి 75 శాతం ఈ వ్యాధి బారిన పడతున్నారని అల్జీమర్స్ సొసైటీ వెల్లడించింది. బ్రెయిన్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. చిన్న రక్త పరీక్ష ద్వారా అల్జీమర్స్‌ను నిర్ధారించవచ్చు. ప్రస్తుతం అల్జీమర్స్ ని నిర్దారించడానికి న్యూరో ఇమేజింగ్ పరీక్షను ఉపయోగిస్తున్నారు. ఈ పరీక్ష అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. రక్తపరీక్ష తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పరీక్ష. ఈ పరీక్ష నిర్వహణ కూడా చాలా సులభం. ఈ పరీక్షా ఫలితాలను నిర్ధారించుకునేందుకు క్లీనికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు అంగీకారం తెలిపిన వారిని ఎంపిక చేసుకొని.. వారికి ఈ పరీక్షలు నిర్వహించామని పిట్స్ బర్గ్ యూనివర్సీటికి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ కారికారి తెలిపారు. 


ఈ కొత్త పరీక్షలో బ్రెయిన్ డైవైర్ట్ టౌ(బీడీ టౌ) అనే ప్రొటీన్ పైన దృష్టి పెడుతున్నారు. సులభంగా గుర్తించలేరు. కానీ ఇది అల్జీమర్స్ తో ముడిపడి ఉంటుంది. రక్తంలో బీడీ టౌ స్థాయిలు సెరిబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ శాంపిల్ లోని రోగుల నమూనాలతో సరిపోలినట్లు తేలింది. అల్జీమర్స్ ను పార్కిన్సన్ వంటి ఇతర మెదడు సంబంధిత సమస్యల నుంచి వేరుచేసేది ఈ ప్రొటీన్ అని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో బీడీ టౌ ఎక్కువగా ఉన్నపుడు అమలాయిడ్ ప్లేక్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ పరీక్ష తర్వాత నుంచి మెదడు సంబంధిత వ్యాధుల నిర్ధారణలో ప్రొటీన్లను పరీక్షించడం అన్నింటికంటే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నారు.


ఇదో మైలు రాయి


బ్లడ్ మార్కర్స్ పరీక్షా విధానం ద్వారా వ్యాధుల నిర్ధారణ సాధ్యపడితే ఎంతోమందిని అల్జీమర్స్‌కు చిక్కుకోకుండా కాపాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం తర్వాత పరిశోధనల్లో ఒక అడుగు ముందుకు పడినట్టుగా భావిస్తున్నారు. త్వరలోనే చికిత్సకు కూడా మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


మందు కూడా 


ఈ పరీక్షా ఫలితాలను బట్టి మెదడులోని హానికారక ప్రోటీన్ తొలగించేందుకు అవసరమ్యే మందులను కూడా సెప్టెంబర్ నెలలో వినియోగించి మంచి ఫలితాలు కూడా సాధించారు. లెకనేమాబ్ అనే ఈ మెడిసిన్ 18 నెలల వ్యవధిలో అల్జీమర్స్ స్థాయిని 27 శాతం వరకు తగ్గించిందట. అమిలాయిడ్ అనే ప్రోటీన్ తో పేరుకుపోయిన చెత్తను మెదడు నుంచి క్లియర్ చెయ్యడంలో ఈ మందు విజయవంతంగా పనిచేస్తోందని ఫలితంగా వ్యాధి పూరోగతి నెమ్మదిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రయోగాల వల్ల జరిగిన పురోగతి అల్జీమర్స్ పేషెంట్లలో కొత్త ఆశలు చిగురింపజేస్తోందని అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.


Also read: బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ నిజంగా అదుపులో ఉంటుందా? ఎలా?