నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో సంస్థ రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. నుమాయిన్ జరిగే అన్ని రోజులు మెట్రో రైలు సేవలను రాత్రి మరో గంటపాటు పొడిగించింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నారు. టర్మినల్‌ స్టేషన్లు అయిన ఎల్బీ నగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం నుంచి సాధారణంగా రాత్రి 11 గంటలకే చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది.


తాజాగా నుమాయిష్‌ ముగిసే వరకు చివరి సర్వీసు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మియాపూర్‌-ఎల్బీ నగర్‌ (రెడ్‌ లైన్‌), నాగోల్‌ నుంచి రాయదుర్గం (బ్లూ లైన్‌) కారిడార్లలో మాత్రమే పొడిగింపు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా, టికెట్ కౌంటర్లను కూడా పెంచారు. ఎగ్జిబిషన్ కి వచ్చే ప్రయాణికుల రద్దీ కారణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నుమాయిష్‌ ఎగ్జిబిషన్ నడిచినంత కాలం గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో ఉండే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పుడున్న 4 టిక్కెట్‌ కౌంటర్లను 6కు పెంచారు.


న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా మెట్రో సర్వీసులను డిసెంబరు 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకూ పొడిగించారు. ఆ రోజు అత్యధికంగా 4.57 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించారు. జనవరి 1 ఆదివారం కావడంతో మెట్రోలో ప్రయాణికులు బాగానే ప్రయాణించారు.


న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడకుండా మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించిన సంగతి తెలిసిందే. మెట్రోలో ప్రయాణికులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. చివరి రైలు ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటి గంటకు మొదలై చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకుంది. 


త్వరలో పెరగనున్న మెట్రో ఛార్జీలు
హైదరాబాద్‌లో మెట్రో రైలు ఛార్జీలు త్వరలో ఎగబాకనున్నాయి. టికెట్ రేట్లను పెంచడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను పెంచడానికి హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఛార్జీల సవరణలో భాగంగా ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నాయి. ఆసక్తికల వారు తమ అభిప్రాయాలను పంపవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.


మెట్రోలో టిక్కెట్‌ ప్రస్తుతం కనిష్ఠం రూ.10 గా ఉంది. గరిష్ఠంగా రూ.60గా ఉంది. 2017 నవంబరు 28న మెట్రో సర్వీసులు ప్రారంభమైనప్పుడు ఈ ఛార్జీలను నిర్ణయించి ప్రకటించారు. అప్పట్లో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ ఛార్జీలను నిర్ణయించింది. అప్పుడే ఈ ఛార్జీలు ఎక్కువనే విమర్శలు వచ్చాయి. తాజాగా ధరలు పెంచుతుండడంతో మళ్లీ వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు.