Rajouri Terrorist Attack:
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. రాజౌరి ప్రాంతంలోనే మరోసారి అలజడి రేగింది. ఇప్పటికే ఇక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్పర్ డంగ్రీ గ్రామానికి చెందిన నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా...ఆరుగురు గాయాల పాలయ్యారు. మళ్లీ ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా...ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరో చోట కూడా IEDని గుర్తించినపోలీసులు...నిర్వీర్యం చేస్తున్నారు. కాల్పుల ఘటనలో సాధారణ పౌరులు చనిపోవడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. డంగ్రీలోని మెయిన్ చౌక్‌లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలోనే బాంబు పేలుడు సంభవించింది. " అధికారులు, పోలీసులు దాడులు జరగకుండా ఆపడంలో విఫలమయ్యారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇక్కడికి రావాలి. మా డిమాండ్‌లు వినాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడిపై మనోజ్ సిన్హా స్పందించారు. ఉగ్ర చర్యను ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు.