Mobile Ban in Schools:
మొబైల్ బ్యాన్ చేయాలని సూచన..
స్కూళ్లలో మొబైల్స్‌ని బ్యాన్ చేయాలని సూచించింది యునెస్కో. సైబర్ నేరాల ముప్పు నుంచి విద్యార్థులను తప్పించేందుకు ఇదే సరైన మార్గం అని వెల్లడించింది. దీనిపై ప్రత్యేకంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఎక్కువ సమయం మొబైల్స్ వాడడం వల్ల వాళ్ల చదువులు దారి తప్పుతున్నాయని వివరించింది. భావోద్వేగాలు అదుపు చేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ టెక్నాలజీపై వాళ్లకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పైనా చర్చించాలని సూచించింది. విద్యావ్యవస్థలో టెక్నాలజీ అమలు చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విద్యార్థులు నేర్చుకునే విధానంలో మార్పు మంచిదే అయినా...అది పరిధులు దాటితే ప్రమాదమని తేల్చి చెప్పింది. టెక్నాలజీ ఉంటేనే అది అభివృద్ధి అన్న సూత్రం అన్ని చోట్లా వర్తించదని స్పష్టం చేసింది.
"సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే విద్యావ్యవస్థ ఉండాలి. అన్ని విద్యా సంస్థలు దీనిపైనే దృష్టి పెట్టాలి. టీచర్‌లు ముఖాముఖి విద్యార్థులతో మాట్లాడాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అన్నీ నేర్చుకునే వెసులుబాటు వచ్చుండొచ్చు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఈ టెక్నాలజీ బాగా కనిపిస్తోంది. ఇలా ఎవరికి వారు నేర్చుకోవడంలో తప్పేం లేకపోయినా...అది విద్యావ్యవస్థ మూలాల్ని చెరిపేసే విధంగా ఉండకూడదు. అందుకే...సంప్రదాయ బోధనపైనా శ్రద్ధ పెట్టాలి. టెక్నాలజీ ఏదైనా సరే..అది చివరికి ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆలోచనా పరిధిని పెంచేదే అయి ఉండాలి. వన్ టు వన్ ఇంటరాక్షన్ అనేది చాలా కీలకం. ఆన్‌లైన్ పాఠాలొచ్చి ఈ ట్రెడిషన్‌ని పూర్తిగా తుడిచి పెట్టేయడానికి వీల్లేదు"
- యునెస్కో
చైనాలో చాలా స్ట్రిక్ట్
లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్న మాట వాస్తవమే అయినా అన్ని వర్గాలకూ సమన్యాయం జరిగే అవకాశాలు తక్కువ అని యునెస్కో నివేదిక వెల్లడించింది. కేవలం ధనిక వర్గంలోని విద్యార్థులకు మాత్రమే నేర్చుకునే అవకాశాలు పరిమితం అవడం మంచిది కాదని అభిప్రాయపడింది. అందుకే..డిజిటల్ సర్వీస్‌లకూ పరిధులు పెట్టుకోవాల్సిన అవసరముందని వివరించింది. ఇందుకు చైనాను ఉదాహరణగా చెప్పింది. చైనాలో డిజిటల్ ఎడ్యుకేషన్‌పై నియంత్రణ విధించింది అక్కడి ప్రభుత్వం. మొత్తం టీచింగ్ టైమ్‌లో కేవలం 30% మాత్రమే ఆన్‌లైన్ టీచింగ్‌కి అవకాశం కల్పించింది. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంది. యూకేలోనూ విద్యాసంస్థల్లో మొబైల్స్‌ని బ్యాన్ చేయాలన్న చర్చ జరుగుతోంది. అయితే...ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు దీనిపై కఠినంగానే ఉంటున్నాయి. ప్రతి ఆరు దేశాల్లో ఒక దేశం స్కూళ్లలో ఫోన్‌లపై బ్యాన్ విధించినట్టు యునెస్కో రిపోర్ట్ వెల్లడించింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లోనూ ప్రభుత్వాలు స్కూళ్లలో మొబైల్ వినియోగంపై కచ్చితంగా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా విద్యావ్యవస్థలో డిజిటల్ టెక్నాలజీ విద్యార్థులకు ఉపయోగపడాలే తప్ప తప్పుదోవ పట్టించకూడదని తెలిపింది యునెస్కో రిపోర్ట్. విద్వేషాలు ప్రచారం చేసేలా విద్యార్థులను ప్రేరేపించడం సరికాదని స్పష్టం చేసింది. అందుకే..వాళ్లను మొబైల్‌కి దూరంగా ఉంచాలని వెల్లడించింది.
Also Read: Rice Exports: బియ్యం ఎగుమతిపై పెద్ద మనుసు చేసుకోండీ- భారత్‌కు ఐఎంఎఫ్ రిక్వస్ట్