Rice Exports: దేశంలో బియ్యం ధరల స్థిరీకరణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు దేశాల్లో సంక్షోభం నెలకొంది. దేశంలో బియ్యం ధరలు నానాటికీ పెరుగుతుండటంతో ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. విదేశాల్లో ఉంటున్న భారతీయులు బియ్యం కోసం తిప్పలు పడుతున్నారు. స్టోర్లు, మాల్స్ ముందు క్యూలు కడుతున్నారు. మార్ట్ లలో భారతీయులు బియ్యం కోసం ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతి దారు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే బియ్యంలో దాదాపు 40 శాతం వరకు కేవలం భారత్ నుంచే అన్ని దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో చాలా దేశాల్లో బియ్యం కొరత వేధిస్తోంది. 


ఈ నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు, ఆయా దేశాల్లో ఉంటున్న వారికి మరెక్కడి నుంచి బియ్యం వస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది అవసరానికి మించి ఎక్కువ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో చాలా స్టోర్లలో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. పలు మాల్స్ లో అధికంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. పలు స్టోర్లలో ఒకరికి ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు. మరికొన్ని మాల్స్ లో ఒకరికి కేవలం 5 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. 






చాలా దేశాల్లో బియ్యం కొరత వల్ల బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత్ ను కోరింది. ఈ కొరత వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రకమైన పరిమితులు ఇతర దేశాల్లోని ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్ ఒలివర్ గౌరించాస్ అన్నారు. 






కాగా, అమెరికాలోని ఇండియన్ స్టోర్ లలో బియ్యం కొనుగోళ్లపై పరిమితులు కొనసాగుతున్నాయి. భారతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక కుటుంబానికి ఒక బ్యాగ్ మాత్రమే అనే బోర్డులు పెట్టి మరీ విక్రయాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఎక్కువగా అమెరికా, థాయ్ లాండ్, ఇంటలీ, స్పెయిన్, శ్రీలంక సహా ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది.