బుధవారం రాత్రి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కుమ్మేస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలు, మధ్య ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఏపీ వెదర్‌మ్యాన్ చెబుతున్నారు. వాతావరణ శాఖ కూడా మూడు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్రకు సమీపంలో ఉంది. ఇది వాయుగుండంగా మారి ఒడిశా తీరం ఛత్తీస్‌గఢ్‌ను దాటుకొని వెళ్తోంది. ప్రస్తుతానికి విశాఖకు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం శ్రీకాకుళం మీదుగా ఒడిశా తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ఫలితంగా ఛత్తీస్‌గఢ్, మధ్య ఆంధ్రప్రదేశ్, తూర్పు తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ రాత్రి నుంచి దీని ప్రభావం గట్టిగా ఉండబోతోంది.
24 గంటల్లో వాయుగుండంగా మారబోతున్న అల్పపీడనం ప్రభావంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తలు వర్షాలు పడబోతున్నాయి. ఈ సాయంత్రం నుంచి ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం ఉంటుంది. కర్నూలు నంద్యాలలో మోస్తరు వర్షాలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడతాయి. సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్, ములుగు, అస్రఫాబాద్‌లో కుంభవృష్టి కురవనుంది. హైదరాబాద్‌లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పెద్దగా కురవకపోయినా జల్లులు కంటిన్యూగా పడుతున్నాయి. ఈ సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో కూడా వర్షాల తీవ్ర పెరగనుంది. రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయి.
ఇవాళ, రేపు గోదావరికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రం తీవ్ర వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, అర్బన్, ఖమ్మంలో తీవ్రమైన వర్షాలు ఉంటాయి. ఆగస్టు మొదటి వారం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వెదబ్ ఎక్స్‌పర్ట్స్.
ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఆ జిల్లాలో రాత్రి కుంభవృష్టి కురిసింది. వేల్పూర్‌లో 40 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అదే జిల్లాలో జక్రాన్‌పల్లె, భీమ్‌గల్ 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆసిఫ్‌నగర్‌లో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కుండపోత వర్షం కారణంగా వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ చోట్ల వాగులు, ఇతర నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పంటలు పాడైపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న వాగులో ఇద్దరు బాలికలు కొట్టుకుపోయారు. వాగు దాటుతున్న ఇద్దరు నీటి ప్రవాహాన్ని గ్రహించలేక గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. 428 ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేశామని, రోడ్లపై నిలిచిపోకుండా చూడాలని సూచించారు. అవసరమైతే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆమె హితవుపలికారు.