Ram Mandir Opening: దాదాపు 500 ఏళ్ల కల నెరవేరింది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకీ అంతా సిద్ధమైంది. 2019లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తరవాత మొదలైన మందిర నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మిగతా నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. నగర శైలిలో దీన్ని నిర్మించారు. అయితే...ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవలే నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయని, వాటన్నింటినీ దాటుకుని విజయవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేశామని వివరించారు. ఈ సమస్యల్లో మొదటికి కూలీల కొరత. గతేడాది నవంబర్‌లో తన పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం చెప్పారు నృపేంద్ర మిశ్రా. దీపావళి సమయంలో చాలా మంది కూలీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడు కూలీలు దొరకడమే కష్టమైపోయింది. నిర్మాణ పనులు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందినట్టు చెప్పారు మిశ్రా. డిసెంబర్ 31 నాటికి అంతా పూర్తి చేయాలని అప్పటికే టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం 3,500 మంది కూలీలు అప్పటికి అందుబాటులో ఉన్నారు. L&T సంస్థ నిర్మాణ పనులు చేపట్టగా...TATA సంస్థ వీటిని పర్యవేక్షించింది. కూలీలను రిక్రూట్ చేసుకునే బాధ్యతని L&T సంస్థే తీసుకుంది. అక్కడ ఒక్కో పనికి ఒక్కో నైపుణ్యం ఉన్న కూలీలు కావాల్సి ఉంటుంది. రాళ్లను ఎత్తడానికి రాజస్థాన్‌ నుంచి, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చడానికి ఒడిశా నుంచి కూలీలను రప్పించారు. మొత్తంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ నుంచే ఎక్కువగా పని చేశారు. 


మట్టితోనే అసలు సమస్య..


ఆలయ నిర్మాణం జరిగిన ప్రాంతంలో మట్టి స్థిరంగా లేదు. వందల ఏళ్ల క్రితం ఇక్కడ సరయూ నది ప్రవహించడం వల్ల ఇంకా అక్కడి మట్టిలో ఆ వదులుదనం ఉన్నట్టు వివరించారు మిశ్రా. నిర్మాణం చేపట్టే క్రమంలో ఇంజనీర్లు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇదే. ఆ సమయంలోనే IIT చెన్నై సహకారం తీసుకున్నారు. 15 మీటర్ల లోతు వరకూ మట్టిని తవ్వి దాన్ని తొలగించి అక్కడ re-engineered soilతో నింపాలని సూచించారు. ఇదే 14 రోజుల తరవాత గట్టి పడుతుందని చెప్పారు ఎక్స్‌పర్ట్‌లు. వాళ్లు చెప్పినట్టుగానే అది రాయిలా తయారైంది. దానిపైనే నిర్మాణం మొదలు పెట్టారు. ఆ తరవాత అసలైన సవాలు...ఆలయం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం. ముఖ్యంగా భూకంపాలను తట్టుకుని నిలబడిగేలా తీర్చి దిద్దడం. అందుకోసం...Central Building Research Institute (CBRI) సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ నమోదైన భూకంపాలకు 50 రెట్లు ఎక్కువగా ప్రకంపనలు వచ్చినా కొంచెం కూడా కదలకుండా పటిష్ఠంగా నిర్మించేలా సూచనలు చేశారు. ల్యాబ్‌లో సిమ్యులేషన్ చేసిన తరవాత పునాదిని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. అందుకే..వెయ్యేళ్లైనా సరే చెక్కు చెదరదని అంత ధీమాగా చెబుతున్నారు. ఈ సవాళ్లన్నీ దాటుకుని ఇలా తుది రూపునకు వచ్చింది అయోధ్య రామ మందిరం. 


Also Read: Ram Mandir Inauguration: బాల రాముడి ఫొటోలు బయటకి రావడంపై ట్రస్ట్ అసహనం, విచారణకు డిమాండ్