Andhra Pradesh Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలను కైవశం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఉత్తరాంధ్రలో ఆధిపత్యం చెలాయించడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటే అధికారం వైపు అంత సులభంగా అడుగులు వేయవచ్చు. గత ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ గాలి వీయడంతో మెజార్టీ స్థానాలను దక్కించుకుని విజయాన్ని చేజిక్కించుకుంది.
వచ్చే ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్రలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార వైసీపీ సంక్షేమ పథకాలను అజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళ‌్తుండగా, ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రజల్లోకి వెళుతోంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 34 స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ అత్యధిక స్థానాలను దక్కించుకుని అధికార పీఠాన్ని కైవశం చేసుకుంది.
మెజార్టీ స్థానాలు సాధిస్తే అధికారం..
రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీలు అధికారాన్ని దక్కించుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే, దాదాపు మూడు వంతులకుపైగా స్థానాలను టీడీపీ గెల్చుకుని అధికాకారాన్ని దక్కించుకుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. 34 స్థానాలకుగాను 28 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరు స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పరిమితమై అధికారాన్ని కోల్పోయింది.
2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజాం, పాలకొండ స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. అదే రెండు స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితమైంది. టెక్కలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇచ్చాపురంలో బెందాళం అశోక్ విజయం సాధించగా, మిగిలిన స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో ఆరు తెలుగుదేశం పార్టీ, మూడింటిని వైసీపీ దక్కించుకున్నాయి. కురుపాం, సాలూరు, బొబ్బిలి స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా, చీపురుపల్లి, పార్వతీపురం, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాలను వైసీపీ దక్కించుకుంది.
విశాఖపట్నం జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ(మిత్రపక్షం బీజేపీతో కలిపి) 12 స్థానాలను దక్కించుకుంది. వైసీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న వైసీపీ విశాఖ నగర పరిధిలోని తూర్పు, దక్షిణం, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఓటమిపాలైంది. నగర పరిధిలోని నాలుగు స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకోగా, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతంలోని సీట్లన్నింటినీలోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
మెజార్టీ స్థానాలపై గురి..
ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను కొనసాగించే ఉద్ధేశంలో ప్రధాన పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై దృష్టి సారించాయి. విజయమే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులు ఎంపికపై దృష్టి సారించింది. మార్పులు, చేర్పులు చేస్తోంది. గడిచిన రెండు ఎన్నికల్లో రాజాం ఎమ్మెల్యేగా విజయం సాధించిన కంబాల జోగులకు స్థానం చలనం కలిగించిన వైసీపీ కొత్త వ్యక్తికి ఇక్కడ అవకాశం కల్పించింది. అలాగే, మరో రెండు నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ కూడా ఆర్థిక, అంగబలం ఉన్న నేతలను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. విజయనగరం, విశాఖ జిల్లాలోనూ ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. జనసేన పార్టీతో పొత్తు ఉన్నందున ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెండు, మూడు స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ కూడా కలిసి వస్తే వారికి రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని టీడీపీ ఆఫర్ చేయవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్రపై ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు సాగుతున్నాయి.