Ramlala Pran Pratishtha:


ఫొటోలు వైరల్..


అయోధ్య బాల రాముడి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ తరవాత దర్శనమివ్వాల్సిన రామయ్య ముందే దర్శనమిచ్చాడు. కళ్లకున్న తెరను తొలగించారు. ఆ ఫొటోలే ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే...అసలు ప్రాణ ప్రతిష్ఠ జరగక ముందే ఆ తెరను ఎలా తొలగిస్తారు..? ఆ ఫొటోలు ఎవరు తీశారు..? ఎవరు బయట పెట్టారు అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు కొన్ని నియమాలు పాటించాలని, వాటిని ఉల్లంఘించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏ విగ్రహాన్నైనా ప్రతిష్ఠించే ముందు కళ్లను తప్పనిసరిగా కప్పి ఉంచాలని, అలా తెరను తొలగించడం దోషం అంటూ మండి పడ్డారు. దీనిపై కచ్చితంగా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. 


"కొత్త విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని అనుకున్నప్పుడు దానికంటూ కొన్ని నిబంధనలుంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతానికి బాల రాముడి విగ్రహాన్ని పూర్తిగా కప్పేశాం. కానీ...ఎవరో దాన్ని తొలగించారు. కళ్లకున్న తెరనీ తీసేశారు. పూర్తిగా విగ్రహం కనిపించేలా ఫొటోలు తీశారు. ప్రతిష్ఠకు ముందు ఇలా చేయడం సరికాదు. ఈ తప్పిదం ఎలా జరిగిందో తప్పకుండా విచారణ చేపడతాం"


- ఆచార్య సత్యేంద్ర దాస్, ప్రధాన పూజారి 


 






బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది. ఈ విగ్రహం పొడవు 5 అడుగులు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌ ఉన్నారు. 


Also Read: Ram Mandir : అయోధ్య రామమందిరం చూసేందుకు వెళ్తున్నారా? అయితే ఈ డిటైల్స్ మీకోసమే