Uniform Civil Code in Assam: యునిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలుకు అసోం ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఈ చట్టానికి ఆమోదం లభించింది. అయితే ఎలా అమలు చేయాలన్న అంశంపై మేధోమథనం చేస్తోంది అసోం ప్రభుత్వం. ఉత్తరాఖండ్‌ చట్టాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో దీనిపై చర్చ జరిగినట్టు ఓ మంత్రి వెల్లడించారు. కానీ...అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో యూసీసీపైనే ఎక్కువగా చర్చ జరిగింది. అసోం ప్రభుత్వం ఈ చట్టం తీసుకొస్తే...ఆ పరిధిలో నుంచి గిరిజనులను తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా సందర్భాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ యూసీసీపై మాట్లాడారు. తమ ప్రభుత్వం కూడా కచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తుందని, గిరిజనులను మాత్రం ఇందులో చేర్చమని స్పష్టం చేశారు. యూసీసీ డ్రాఫ్ట్‌ బిల్ తయారైనప్పటి నుంచే అసోం ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తోంది. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటోంది. అదే చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ అమలు చేయొచ్చా లేదా అనే కసరత్తు చేస్తోంది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. 


"అసోంలోనూ యూసీసీ అమలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చట్టంలో ఏముందో పరిశీలిస్తున్నాం. ఆ తరవాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇది అమలు చేయొచ్చా అన్నది పరిశీలిస్తాం"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి 


అసోం కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే...ఆ జాబితాలో యూసీసీ లేదని మంత్రులు వెల్లడించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, దేశానికి మేలు చేసే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారని కేబినెట్ మీటింగ్‌లో అందరూ విశ్వాసం వ్యక్తం చేశారు. 


"యూసీసీకి సంబంధించి కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా బహుభార్యత్వంపై చర్చించాం. బహుశా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే నాటికి ఈ బిల్లుని ప్రవేశపెడుతుండొచ్చు"


- మల్లబరువా, అసోం మంత్రి 
 
ఫిబ్రవరి 5వ తేదీన అసోం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నెల 28 వరకూ అవి కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 11 కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టాలని చూస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆ లిస్ట్‌ని రెడీ చేసుకుంది. ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. బిల్లును పుష్కరసింగ్‌ ధామీ సభలో ప్రవేశపెట్టారు. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లులో వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన అంశాలతోపాటు సహ జీవనానికి రిజిస్ర్టేషన్‌ వంటి అంశాలను పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించాలని విపక్షాలు సూచించినా అధికార పార్టీ మాత్రం పట్టించుకోకుండా పంతం నెగ్గించుకుంది. ఒకసారి గవర్నర్‌ ఆమోదం లభిస్తే అది చట్టంగా మారనుంది. 


Also Read: ఇకపై GPS ఆధారంగా టోల్ వసూళ్లు, త్వరలోనే అమల్లోకి - కేంద్రం కీలక ప్రకటన