GPS Based Toll Collection: ఇకపై టోల్ ప్లాజాల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించకుండా చేసే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. టోల్ వసూలు చేసే విధానాన్ని మార్చనుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. GPS ఆధారిత టోల్ వసూలు విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజా సిస్టమ్ స్థానంలో ఈ కొత్త సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. GPS-based toll collection system ని అమలు చేసేందుకు అవసరమైన కన్సల్టెంట్‌నీ ఇప్పటికీ నియమించింది. FASTags తో పాటు ఈ సిస్టమ్ కూడా కొనసాగుతుందని, ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌లా చేపడతామని నితిన్ గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఎంత దూరం ప్రయాణిస్తే అంత వరకే టోల్ వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త సిస్టమ్‌ని తీసుకురానుంది కేంద్రం. టోల్ వసూళ్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందో ఇప్పటికే లెక్కలు చెప్పారు గడ్కరీ. NHAIకి టోల్ వసూళ్ల ద్వారా రూ.40 వేల కోట్లు వచ్చాయని వెల్లడించారు. మరో రెండు మూడేళ్లలో ఈ ఆదాయం రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో GPS-based toll systems ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆరు నెలల్లో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018-19 మధ్య కాలంలో టోల్ ప్లాజాల వద్ద యావరేజ్ వెయిటింగ్ టైమ్ 8 నిముషాలుగా ఉంది. FASTags ని అమల్లోకి తీసుకొచ్చాక 2020-21, 2021-22 మధ్య కాలంలో ఈ వెయిటింగ్ టైమ్ 47 సెకన్లకు తగ్గింది. 2021లో ఈ ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది.
హైవేలపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా టోల్ కట్టేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు టోల్ వసూలు చేస్తోంది. అయితే...ఫాస్టాగ్‌లతో వెయిటింగ్ టైమ్ తగ్గినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల బిజీగానే ఉంటోంది. ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే..జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేయనుంది కేంద్రం. ఇందులో automatic number plate recognition (ANPR) సిస్టమ్ ఉంటుంది. హైవేస్‌పై ఉన్న కెమెరాల ద్వారా వీటిని డిటెక్ట్ చేస్తారు. ఎంత దూరం ప్రయాణించారనే దాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. ప్రస్తుతం ఫాస్టాగ్‌లో RFID ఆధారంగా టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ పరిధిలో ఓ వాహనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది..? ఎక్కడ ఎగ్జిట్ అయింది..? ఎంత దూరం ప్రయాణించింది లాంటి వివరాలన్నీ నంబర్ ప్లేట్‌ని స్కాన్ చేసి తెలుసుకుంటారు. వాటి ఆధారంగానే వసూలు చేస్తారు. చిన్న చిన్న దూరాలకూ ఎక్కువ మొత్తంలో టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు భారం తగ్గినట్టే. electronic payment system ద్వారా ఆటోమెటిక్‌గా మనీ డెబిట్ అవుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు టోల్ ప్లాజాల వద్ద ఎదురు చూడాల్సిన తిప్పలు తప్పుతాయి.