CLP Meeting News: నేడు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఆదివారం (ఫిబ్రవరి 11) సాయంత్రం ఆరు గంటలకు ప్రజా భవన్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖపై సోమవారం శేతపత్రం పెట్టనున్నందున ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకల విషయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.


గత ప్రభుత్వం నీటిపారుదల శాఖలో చేసిన అవినీతిపై ఈ సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు. సోమవారం (ఫిబ్రవరి 12) జరగబోయే అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై, ఏం మాట్లాడాలనే దానిపై ఈరోజు సీఎల్సీలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎల్లుండి (మంగళవారం) మేడిగడ్డ ఫీల్డ్ విజిట్‌లో చేయనున్నందున కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ చేయనున్నారు. గత ప్రభుత్వ నీటిపారుదలలో గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు.