Pre Wedding shoot in operation theatre: ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన డాక్టర్‌ని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తున్నట్టుగా వీడియో, ఫొటోలు షూట్ చేశారు. ఓ వ్యక్తిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి ఇదంతా రికార్డ్ చేశారు. చిత్రదుర్గలోని భరమసాగర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. కాంట్రాక్ట్ ఫిజిషియన్‌గా పని చేస్తున్న అభిషేక్ తన ఫియాన్సీతో కలిసి ఇలా వీడియో షూట్ చేయడంపై అధికారులు తీవ్రంగా మండి పడ్డారు. కాబోయే భార్య సర్జికల్ టూల్స్ ఇస్తుంటే సర్జరీ చేస్తున్నట్టుగా నటించారు. ఇది చూస్తూ చుట్టూ ఉన్న కెమెరామేన్స్‌ గట్టిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జిల్లా వైద్యాధికారి వెంటనే అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ థియేటర్‌లో ఇలాంటివి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌కి నోటీసులు జారీ చేయడంతో పాటు ఆ డాక్టర్‌ని సస్పెండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికేనని, ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం వాడుకోవడం సరికాదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేశ్ గుండు రావు స్పష్టం చేశారు. ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని అస్సలు సహించం అని తేల్చి చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలని  ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.