Arvind Kejriwal:


6 పాయింట్ల ఎజెండా 


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మేక్ ఇండియా నంబర్ వన్ (Make India No.1)అనే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టారు. ఇటీవల దానికి సంబందించిన ఎజెంజడాను ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సదస్సులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో 6 పాయింట్ల ఎజెండాను వెల్లడించారు. "మొత్తం 130 కోట్ల మందిని ఒక్కటి చేసి భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా నిలపాలి" అని పిలుపునిచ్చారు కేజ్రీవాల్. తొలిసారి " రాష్ట్రీయ జనప్రతినిధి సమ్మేళన్" కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహించారు. ఈ ఎజెండాలో ఆరోగ్య సంరక్షణ, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఉద్యోగ భద్రత, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు లాంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. 


1. అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించటం. 
2. ఐదేళ్లలో భారత్‌లో పేదరికాన్ని తగ్గించటం. 
3. యువత అందరికీ ఉద్యోగాలు కల్పించటం. 
4. మహిళలకు మంచి అవకాశాలు ఇవ్వటం, వారికి భద్రత అందించటం. 
5. ప్రపంచ స్థాయి  మౌలికవసతుల కల్పన
6. రైతులకు లబ్ధి చేకూరేలా పంటలకు పూర్తి మద్దతు ధరను ఇవ్వటం


సదస్సులో ప్రకటన..


తొలిసారి జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఢిల్లీలోని 62 మంది ఎమ్మెల్యేలు, పంజాబ్‌కు చెందిన 92 మంది ఎమ్మెల్యేలు, గోవా నుంచి ఇద్దరితో పాటు మొత్తం 10 మంది ఆప్ ఎంపీలు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో భాజపాపైనా చర్చించారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమవడంపై విస్తృతంగా చర్చలు జరిపారు. భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు ఈ మీటింగ్‌లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత నెల మేక్ ఇండియా నంబర్ 1 (Make India No1) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను వెల్లడించారు. "ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్ ఇచ్చి భారత్‌ నంబర్ వన్ అయ్యేందుకు సహకరించండి" అని పిలుపునిచ్చారు. "ఈ మిషన్‌లో పాల్గొనాలని అనుకునే వాళ్లు 9510001000 నంబర్‌కి మిస్డ్‌ కాల్ ఇవ్వండి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్‌ను మార్చేందుకు సహకరించండి" అని విజ్ఞప్తి చేశారు.


ఆగస్టు 17న ఈ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు చెప్పారు. సుపరిపాలనే లక్ష్యంగా 5 అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకోసం ప్రపంచ దేశాలు పర్యటించి మద్దతు కూడగడతానని వెల్లడించారు. దీన్ని ఓ "నేషనల్ మిషన్" అని చెబుతు న్నారు కేజ్రీవాల్. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలవాలన్న భారత్‌ కలను నెరవేర్చుకునేందుకు అందరం ఈ మిషన్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "మరోసారి మన భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలి" అని ఆకాంక్షించారు. "స్వాతంత్య్రం సాధించుకుని 75 ఏళ్లైంది. ఈ 75 సంవత్సరాల్లో భారత్ ఎంతో సాధించింది. కానీ..మన తరవాత స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు మన కన్నా ముందున్నాయి. దీనిపైనే ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మనమెందుకు వెనకబడాలి..? ప్రతి పౌరుడూ ఇదే ప్రశ్నిస్తున్నాడు" అని అన్నారు. 


Also Read: NIA Searches: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కలకలం! నిజామాబాద్, కర్నూల్ సహా కొన్ని జిల్లాల్లో భారీగా తనిఖీలు