రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు మరోసారి NIA సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిజామాబాద్, కర్నూల్, గుంటూరు జిల్లాలో NIA అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ లో 23 బృందాలతో NIA సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూల్, కడప ప్రాంతాల్లో 23 బృందాలతో పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై NIA అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.


PFI జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ పేరుతో పీఎఫ్ఐ కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. మతకలహాలు సృష్టించేందుకు చురుకైన అతివాదులు మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్లు NIA అధికారులు గుర్తించారు. వీరికి గతంలో జరిగిన నిర్మల్ జిల్లా బైంసా అల్లర్లతో సంబంధాలపై కూడా ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. నెల్లూరు లో కూడా NIA సోదాలు నిర్వహిస్తున్నారు.


జగిత్యాలలోనూ


జగిత్యాలలోనూ ఒక్కసారిగా NIA దాడులు చేయడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజాము నుండి ఎన్ ఐ ఏ అధికారులు జగిత్యాల జిల్లాలో పాపులర్ ఫ్రంట్ నాయకుల ఇండ్లపై దాడులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లోని ఒక నివాసంలో, జగిత్యాల పట్టణంనిలో ముగ్గురు నివాసాలతో పాటు ఒక మెడికల్ షాప్ లలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒకరి నివాసంలో డైరీతో పాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసుల సమక్షంలో ఎస్ ఐ ఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం.



నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చార్జిషీట్ ఆధారంగా పీఎఫ్ఐ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎన్ఐఏ ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ లోకల్ పోలీసుల సహకారంతో ఈ సోదాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ ఖాదర్ పీఎఫ్ఐ ని ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చాడు. అతడికి గుండారంకు చెందిన పీఎఫ్ ఐ జిల్లా కన్వీనర్ సాయం చేయడంతో పాటు ఆర్థికంగా సహాయం చేయడంతో జిల్లా కేంద్రంలో పీఎఫ్ఐ శిక్షణ కేంద్రం ఏర్పాటు జరిగింది. అక్కడ మదర్సాలలో ఎంపిక చేసిన యువకులకు ఒక వర్గం వారిపై మతద్వేషాలను రెచ్చగొట్టడం, మతకల్లోలాలు, గొడవలు సృష్టించడం, దాడులకు ప్రేరేపించడం లాంటి అంశాలలో సుమారు 400 మందికి శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. 


ఆదిలాబాద్ జిల్లాలో NIA సోదాలు, ఒకరి అరెస్ట్! 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో NIA సోదాలు కలకలం సృష్టించాయి. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ లోని అబుబాకర్ మసీదు సమీపంలో ఓ ఇంట్లో NIA బృందం సోదాలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతని వద్ద నుంచి ఓ ల్యాప్ టాప్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. జిల్లా జైలులో ఉన్న కొంతమందితో తమకు సంబంధాలున్నట్లుగా ఫిరోజ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన అనంతరం ఫిరోజ్ ని జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి జిల్లా జైలుకు తరలించారు. అటు నిర్మల్ జిల్లా భైంసాలోనూ NIA అధికారులు సోదాలు నిర్వహించారు. భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో ఓ ఇంట్లో NIA బృందం సోదాలు చేపట్టారు. (PFI) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరుతో శిక్షణ నడిపిస్తూ కరాటే శిక్షణ పేరుతో మతపరమైన దాడులకు పాల్పడేలా శిక్షణ ఇస్తున్న పలువురిపై నిఘా పెట్టారు. ఆదిలాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాలోని పలుచోట్ల NIA సోదాలు చేపట్టింది. నిజామాబాద్ కు చెందిన మహమ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి ఆదిలాబాద్ లో పట్టుబడి జైలుకు తరలించడంతో జిల్లా ప్రజలు ఉలిక్కి పడ్డారు.  


సురారంలో సోదాలు 


మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సురారంలోని  సాయిబాబా నగర్ జమీయా తలిముల్ ఇస్లాం మదర్సాలో NIA సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో 10 మంది అధికారులు పాల్గొన్నారు. అక్కడున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనపరచుకున్నారు.  మదర్సా ఉపాధ్యాయుడు PFI సభ్యుడిగా గుర్తించారు. 


 


ఏపీ వారికి శిక్షణ
అలా నిజామాబాద్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతో పాటు ఏపీలోని కర్నూల్, కడప, అనంతపూర్ జిల్లాలకు చెందిన యువతకు అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఆ విషయం గుర్తించిన నిజామాబాద్ పోలీసులు అబ్దుల్ ఖాదర్ తో పాటు 28 మందిపై గతంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో సుమారు పదిమందిని అరెస్టు చేశారు. జూలై మాసంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ టీం ప్రశ్నించింది. వారికి విదేశాల నుంచి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించి స్థానిక నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి నిజామాబాద్ బోధన్, ఆర్మూర్, నవీపేట, నందిపేట ప్రాంతాల్లో వేర్వేరు బృందాలు సోదాలు చేస్తున్నాయి.