Kohli New Look: భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ చాలా స్టయిలిష్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. కోహ్లీ తన జుట్టుతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా ప్రతి సిరీస్ కు ముందు అతను తన హెయిర్ స్టైల్ లో మార్పులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న విరాట్ తన కొత్త హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 


కోహ్లీ కొత్త లుక్ కు సంబంధించిన అనేక చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలను ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ రషీద్ సాల్మానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతనే కోహ్లీకి కొత్త రూపాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. 


కోహ్లీ కొత్త లుక్ చూసి అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. విత్ ద కింగ్ హిమ్ సెల్ఫ్ అని రిప్లై ఇచ్చాడు. అలానే సింగర్ హార్డీ సంధు చా గయే గురూ అంటూ కామెంట్ చేశారు. అభిమానులైతే చాలా హాట్ గా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 


మెగా టోర్నీకి సన్నద్ధం


అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రస్తుతం కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. అక్టోబర్ 23న పాకిస్థాన్ తో మ్యాచ్ తో భారత్ ప్రపంచకప్ టోర్నీని ప్రారంభిస్తుంది. ఇటీవల ఆసియా కప్ తో కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మునుపటిలా ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అంతేకాక దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ మార్కును అందుకున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీపై భారత్ చాలా ఆశలే పెట్టుకుంది. 


టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు 


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్.


ఈ టీ20 ప్రపంచకప్ నకు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్ లు ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి మొహాలీ వేదికగా ఆసీస్ తో 3 టీ20 ల సిరీస్ ప్రారంభమవుతుంది.