Amaravati Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. అమరావతి నుంచి అరసవల్లి వరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభం అయింది. నేడు బాపట్లకు చేరుకుంది. అమరావతి రైతులకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సిక్కోలు వాసుల సంఘీభావం తెలిపారు. పాదయాత్ర విజయవంతం కావాలని రైతులు, టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నేత గొండు శంకర్ నేతృత్వంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి 101 కొబ్బరి కాయలు కొట్టి మరీ మొక్కులు చెల్లించుకున్నారు.
అపూర్వ స్వాగతం లభిస్తోందంటున్న రైతులు
పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందని, ఊహించిన దానికన్నా మిన్నగా ఆదరణ లభిస్తుండడంతో అమరావతి రైతును అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందనిన రైతులు మండిపడుతున్నారు. వైసీపీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు హాజరై పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రజలు అడుగడుగునా రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో వితడగా ప్రారంభం అయిన పాదయాత్రను ఉద్దేశించి మంత్రులు కూడ ఫైర్ అవుతున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఒక ప్రాంతవాసులు వ్యవహరిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర..
12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రైతుల మహాపాదయాత్ర సాగనుంది. ఆ దారిలో వచ్చే మోపిదేవి, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. ఈసారి జాతీయ రహదారుల వెంటకాకుండా.. పల్లెలు, పట్టణాలలో నడిచే విధంగా రూట్ మ్యాప్ రూపొందించుకున్నామని తెలిపారు. యాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వివిధ కమిటీలు సమన్వయం చేసేలా ప్రణాళిక తయారు చేశారు.
మూడు రాజధానులు ఖాయమంటున్న మంత్రులు ..
బౌన్సర్లు పెట్టుకుని రైతులు పాదయాత్ర చేయడం ఏంటని ప్రశ్నించారు మంత్రులు. నిజమైన రైతులు ఎలా ఉంటారో ప్రజలకు తెలుసని, తామూ రైతు బిడ్డలమేనని, జగన్ ప్రతిపాదించిన వ్యక్తి గతంగా మూడు రాజధానులనే కోరుకుంటున్నామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి చోట్ల పెట్టుబడులు పెట్టేసి అంతా కోల్పోయాం, మళ్ళీ అదే తప్పు ఎందుకు చేయాలని, అందుకే మా ప్రభుత్వ నిర్ణయం మూడు రాజధానుల కావాలనే కోరుకుంటుందని తెలిపారు. రైతులు పాదయాత్ర చేసినంత మాత్రాన మూడు రాజధానుల నిర్ణయం ఆగదన్నారు.
1000 రోజుల అలుపెరుగని పోరాటం..
అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులవుతోంది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని.. ఏపీకీ అవసరమేనని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి రైతులు ఉద్యమం ప్రారంభించారు. మూడు రాజధానుల ప్రకటన పాతికవేల మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో అణుబాంబులా పడింది. అప్పట్నుంచి ఆ రైతులు పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. కులం ముద్ర వేశారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేసులు పెట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయపోరాటం చేసి అనుకూల తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ వారికి ఊరట లేదు. ఎందుకంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పును శిరసావహించడానికి సిద్ధంగా లేదు.