Minister Gudivada Amarnath : వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పిటిషన్ వేశామన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక రాకముందే టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ఆరోపించారు. అప్పట్లో రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్‌పర్ట్‌ కమిటీ కాదని, ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ అని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవ్వడంతో ఉద్యమాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు భంగం వాటిల్లే విధంగా ఉన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. 


రాజధాని అంశం రాష్ట్రానికి చెందినదే 


"రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసనసభలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై అధికారం లేదని సరికాదని శాసనసభ అభిప్రాయపడింది. సీఆర్డీఏ చట్టాన్ని 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది కేంద్రం చేసిన చట్టం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి మార్చడానికి అధికారం లేదని అనడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం. టీడీపీ ఎంపీ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాజధాని అంశంపై రాష్ట్రానికి చెందినది అని కేంద్రం చెప్పింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలను గుర్తుచేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశాం. పునర్విభజన చట్టం ప్రకారం ఓ కమిటీని ఏర్పాటుచేసి దాని ప్రకారం రాజధానిని నిర్ణయించారని కోర్టు తీర్పులో ఉంది. 2014లో రాజధానిపై వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇది ఎలా చెల్లుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం." -  మంత్రి గుడివాడ అమర్ నాథ్ 


చంద్రబాబుకు ఎందుకంత తపన


చంద్రబాబు అతని అనుచరులు అమరావతి ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా ముందుగానే భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని రాజధానిగా ప్రకటించారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబు తను కట్టని, కట్టలేని దానికోసం ఎందుకు  తపనపడుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు కనీసం యాభై ఎనిమిది నెలలపాటు అమరావతిని పాలించలేని ఆయన రాష్ట్రాన్ని ఏం చేయాలని ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి ప్రయత్నాలు సాగిస్తుంటే కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్న రాజకీయ యాత్ర అని అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతితో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేస్తామని, అమరావతి పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు తమ ప్రభుత్వానికి సమయం ఉందని అమర్నాథ్ తెలియజేశారు.
 


Also Read : Nara Lokesh : అధర్మం అంతర్జాతీయ కోర్టుకెళ్లినా అంతిమ విజయం న్యాయానిదే - నారా లోకేశ్


Also Read : GVL : న్యాయపరంగా మూడు రాజధానులు అసాధ్యం - వైఎస్ఆర్‌సీపీకి క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ !