Apple Watch Saves Life:
పుణే కుర్రాడి కథ ఇది..
ప్రస్తుతం మన లైఫ్ అంతా గ్యాడ్జెట్స్ చుట్టూనే తిరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్రతి పనినీ సింపుల్‌గా చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లే కాదు. స్మార్ట్ వాచ్‌ల వినియోగమూ పెరుగుతోంది. అనలాగ్ వాచ్‌లకు కాలం చెల్లిపోతోంది. అందరూ ఈ స్మార్ట్‌వాచ్‌లనే కొనుగోలు చేస్తున్నారు. వీటిలో యాపిల్ (Apple Smart Wacth) స్మార్ట్ వాచ్‌లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ధర ఎక్కువైనా...యూత్ అంతా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అందులో ఉండే ఫీచర్లు అలాంటివి మరి. అయితే...ఈ వాచ్‌లు కేవలం అందం కోసమే కాదు. ప్రాణాలు కూడా కాపాడతాయని నిరూపించింది ఓ ఘటన. మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ కుర్రాడు చెప్పిన విషయం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. జులైలో జరిగిన ఓ దుర్ఘటన గురించి చెప్పాడు స్మిత్ మెహతా అనే కుర్రాడు. నీట్ ఎగ్జామ్ కోసం పుణేలో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాడు. సరదాగా ట్రెకింగ్ చేద్దామని ఫ్రెండ్స్‌తో కలిసి లోనావాలా వెళ్లాడు. ట్రెకింగ్ చేసి తిరిగి వచ్చే సమయంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ఓ లోయలో పడిపోయాడు. ఓ చెట్టుపై పడిపోయి..రాయికి ఢీ కొట్టి అక్కడే ఇరుక్కుపోయాడు. లోయ అంచులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండిపోయాడు. సాయం చేయడానికి చుట్టపక్కల ఎవరూ లేరు. చాలా సేపటి తరవాత తన ఫోన్ తన ఫ్రెండ్ బ్యాగ్‌లో ఉందని గుర్తొచ్చింది. చేతికి యాపిల్ వాచ్ ఉంది. వెంటనే తనకో ఐడియా తట్టింది. బిల్ ఇన్ సెల్యులార్(Built-in Cellular) కనెక్టివిటీ అనే ఫీచర్ ఉండటం వల్ల వెంటనే ఆ వాచ్‌లో నుంచే తన పేరెంట్స్‌కి కాల్ చేశాడు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వివరించాడు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని ట్రెకర్స్ సాయంతో ఆ యువకుడిని సురక్షితంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు.
టిమ్ కుక్‌కి మెయిల్..
"గాయాలయ్యాయి. రక్తం కారుతోంది. దట్టమైన అడవిలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నా దగ్గర యాపిల్ వాచ్ లేకపోయుంటే...వాళ్లు నా ఆచూకీ కనిపెట్టడానికి చాలా సమయం పట్టి ఉండేది" అని చెప్పాడు యువకుడు. లోనావాలాలోని ఓ హాస్పిటల్‌లో ఈ బాధితుడికి సర్జరీ చేశారు. ఆ తరవాత ముంబయిలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆగస్ట్‌లో డిశ్చార్జ్ చేశారు. "ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నాను" అని చెబుతున్నాడు యువకుడు. తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ కలిపి Apple CEO టిమ్‌కుక్‌కి మెయిల్ చేశాడు. ఈ యువకుడికి రిప్లై ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు టిమ్ కుక్. "నువ్వు కోలుకుంటున్నావన్న వార్త చాలా సంతోషాన్నిస్తోంది" అని రిప్లై ఇచ్చాడు. ఇప్పుడీ కథంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనం జస్ట్ గ్యాడ్జెట్సే కదా అనుకుంటాం. కానీ...ఒక్కోసారి అవే మనల్ని ప్రాణాపాయం నుంచి తప్పిస్తాయి అని ఈ ఘటనలో రుజువైంది. ఈ కథంతా విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Indian Railway news: రైల్వే ఉద్యోగులకు బొనాంజా- 80 వేల మందికి జీతం పెంపు!