G20 Summit:
మీటింగ్ అందుకేనా..?
తూర్పు పోలండ్ లో జరిగిన క్షిపణి దాడి విధ్వంసం పై చర్చించేందుకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సదస్సులో అమెరికా ఓ ఎమర్జెన్సీ మీటింగ్ ను నిర్వహించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగానే ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ భూభాగంపై రష్యా క్షిపణి ప్రయోగాలు చేస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ఇందుకోసమే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో దేశాలు మరికొన్ని దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రష్యాను నిలువరించాల్సిన అవసరం సహా ఉక్రెయిన్, పోలాండ్ లకు సైన్యం పరంగా ఎలాంటి సహకారం అందించాలి...ఇంకా అక్కడి ప్రజల ప్రాణాలకు పొంచి ముప్పును తప్పించాల్సిన బాధ్యతలు, దౌత్యపరంగా అవలంబించాల్సిన విధానాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశంలో చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ సమావేశానికి భారత్ కు ఆహ్వానం అందకపోవటంపై పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జీ20 కూటమి అధ్యక్షుడిగా భారత ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన టైం లోనే అక్కడే ఇలాంటి ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవటం...పైగా మోడీని పిలవకపోవటంపై వేర్వేరు వార్తలు వచ్చాయి.
ఎన్నో ప్రశ్నలు..
విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోదీ ని అమెరికా అధ్యక్షుడు పక్కనపెట్టారంటూ ప్రొఫెసర్ అశోక్ శ్వైన్ ట్వీట్ చేశారు. అమెరికా నిజంగానే భారత్ ను పక్కనపెట్టిందా లేదా మరే దైనా కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ మీడియా ఇంటరాక్షన్ ను వైట్ హౌస్ పబ్లిష్ చేసింది. అందులో పోలండ్, ఉక్రెయిన్ లకు ఎలా మద్దతుగా నిలబడాలన్న అంశంపై నాటో సభ్య దేశాలు, జీ7 దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు సమావేశమైనట్లు ఉంది. ఇదే విషయాన్ని జో బిడైన్ ట్వీట్ కూడా చేశారు.
కొన్ని అనుమానాలు..
కేవలం నాటో దేశాల మీటింగ్ అయితే జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆ మీటింగ్ లో ఉండటం.. జీ7 దేశాల మీటింగ్ అయితే..జీ20 సదస్సు జరుగుతున్నప్పుడు వేరే కూటమిల సదస్సులు నిర్వహించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . అయితే వైట్ హౌస్ కానీ, ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రధాని మోదీ జీ 20 దేశాల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పక్కనే ఉన్నారు. ప్రధాని మోదీని ఆయన అభినందించారు కూడా. జీ20 అధినేతలంతా కలిసి మాంగ్రూవ్ ప్లాంటేషన్ చేసినప్పుడు మోదీ పక్కనే జో బైడెన్ ఉన్నారు. అంతే కాకుండా జీ20 కూటమి ప్రస్తుత అధ్యక్షుడు మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తో జో బైడెన్ ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. ఈ భేటీ ఇరు దేశాలకు మేలు చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
Also Read: War Politics : రాజకీయ పార్టీల ధర్మయుద్ధాలన్నీ ఓట్ల కోసమేనా? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయరా ?