War Politics  :  బీజేపీతో  ధర్మయుద్ధం చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి యుద్ధానికి ధర్మం, అధర్మం ఉండదు. యుద్ధమంటే యుద్ధం అంతే. రాజకీయ యుద్ధానికి అసలు ఉండదు. ఇలాంటి యుద్ధాలు ఇటీవలి కాలంలో చాలా జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తున్నారన్న విషయం పక్కన పెడితే అసలు యుద్ధం ఎందుకు అన్న ఆలోచిస్తే మాత్రం .. ప్రజల కోసం కాదు అని స్పష్టమన విషయం మనకు అర్థమవుతుంది. రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధాలన్నీ.. వారి స్వలాభం కోసమే. అధికారం కోసమే. కానీ ఏ యుద్ధమూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయలేదు. 


కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్న వారంతా రాజకీయ కోణంలోనే!


కేంద్రంపై ఇప్పటికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. తాజాగా  వారి జాబితాలో కేసీఆర్ చేరారు. ఆయన యుద్ధం పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉంది. తెలంగాణకు ఏమీ చేయలేదని.. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపిస్తూ ధర్నాలు చేశారు. కానీ అసలు విషయం మాత్రం రాజకీయమేనని బయట జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.  తెలంగాణ సర్కార్‌ను కూలదోయడానికి కుట్ర చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్ రివర్స్ రాజకీయం చేస్తున్నారు. సానుకూలంగా ఉన్నా..  రాజకీయం.. రాజకీయమేనని బీజేపీ భావిస్తోందని అర్థమైన తర్వాత ఏం జరిగితే అది జరగని అని పోరుబాట ఎంచుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణకు పోటీగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీతో మహా యుద్ధమే ఉంటుందని పార్టీ శ్రేణుల్ని రెడీ చేశారు. 


గతంలో చంద్రబాబు కూడా అంతే...!


2018లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. అప్పటి వరకూ బీజేపీతో పొత్తులో ఉండి.. ఎన్నికల చివరి ఏడాది.. ఏపీకి అన్యాయం జరుగుతోందన్న ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చి  యుద్ధం ప్రకటించారు. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి.. కేంద్రంలో చక్రం తిప్పాలన్న వ్యూహంతోనే చంద్రబాబు బయటకు వచ్చారని ఎక్కువ మంది నమ్మకం. రాజకీయ కోణంలోనే చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. .. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఎక్కువ మంది నమ్ముతారు. 


యుద్ధాలు ప్రకటిస్తున్న.. ప్రకటించిన ఇతర నేతలూ ఉంతే !


ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు ప్రకటించిన ధర్మయుద్ధాలన్నీ అంతే . చంద్రబాబు నుంచి  మమత బెనర్జీ వరకు.. ఇంకా  చెప్పాలంటే సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. నాడు చంద్రబాబు యుద్ధమన్నారు... ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. తర్వాత మమత బెనర్జీ కూడా పోరాటం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రుల అరెస్టుతో సైలెంట్‌ అయ్యారు. నితీష్ కుమారు కూడా ప్రస్తుతానికి సైలెంట్‌... స్టాలిన్ సైలెంట్‌... కేరళ సీఎం సైలెంట్‌...ఎందుకంటే.. ఇప్పుడు వారందరికీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ పరిణామాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. రాజకీయంగా అవసరమైనప్పుడు మళ్లీ కత్తీ డాలుతీసే అవకాశం ఉంది. 


ఒకరి యుద్ధానికి మరొకరు సహకరించకపోవడమే అసలు రాజకీయం !


విషయం ఏమిటంటే ఇప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్న పార్టీలకు ఇతర పార్టీల మద్దతు లభించడం లేదు. నువ్ యుద్ధం చెయ్ మేం చూస్తామన్నట్లుగా ఉంటాయి. టీడీపీ బీజేపీపై యుద్ధం ప్రకటించినప్పుడు టీఆర్ఎస్ అధినేత ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆయనే పోరాడుతున్నారు కానీ టీడీపీ సంఘిభావం చెప్పడం లేదు. టీడీపీ కాకపోయినా వైసీపీతో మంచి అనుబంధం  ఉన్న వైఎస్ఆర్‌సీపీ కూడా చెప్పడం లేదు.  వీరే కాదు..బీజేపీతో బద్ద శత్రుత్వం ఉన్న ఎవరూ  యుద్ధానికి కేసీఆర్‌తోకలిసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే రాజకీయ యుద్ధాలు.. వారి కోసమే కానీ.. రాష్ట్రాల కోసం కాదు.