Jagan 30 Years Logic  :  ఈ సారి  గెలిస్తే మనమే 30 ఏళ్లు ఉంటాం ! .. అని జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ సమీక్షల్లోనే కాదు పార్టీకి సంబంధించిన ప్రతీ సమావేశంలోనూ చెబుతూ ఉంటారు. ఒక్క సారి గెలిస్తే ఐదేళ్లు ఉంటారు..కానీ ఈ సారి గెలిస్తే  ఎలా 30 ఏళ్లు ఉంటారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అసలు జగన్ లాజిక్ ఏమిటో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు. రాజకీయాలంటేనే డైనమిక్. ఈ రోజు ఉండే పరిస్థితులు రేపు ఉండవు. ఆ విషయం సీఎం జగన్‌కూ తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అంత అవగాహన ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు మనకే అధికారం అని జగన్ ఎందుకు అనుకుంటున్నారు ? అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి ?


రెండో సారి గెలిస్తే ఇక తిరుగు ఉండదని జగన్ అనుకుంటున్నారా ?


ఒక్క చాన్స్ ఇవ్వండి.. జన రంజకమైన పాలన చేసి ప్రతి ఇంట్లోనూ నాన్న గారితో పాటు నా ఫోటో పెట్టుకునేలా పరిపాలన చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారసభల్లో చెప్పేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అలా పరిపాలించారా లేదా అన్న విషయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న సంగతిని పక్కన పెడితే.. తన పాలనపై మాత్రం సీఎం జగన్‌కు ఎక్కడా లేనంత నమ్మకం ఉంది. అందుకే 175 సీట్లు ఖాయమంటున్నారు. అలాగని లైట్ తీసుకోవడం లేదు. పార్టీ నేతలందరితో పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికి ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. ఎంత సాయం చేశారో గుర్తు చేస్తున్నారు. అలా అందరూ ఓట్లేస్తారని.. భావిస్తున్నారు. ఈ సారి గెలిస్తే.. ఇక తిరుగు ఉండదని.. తన పార్ములా వర్కవుట్ అయినట్లేనని... అది మరో 30 ఏళ్లు పని చేస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా ఉందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


చంద్రబాబు మరో ఎన్నిక సమయానికి యాక్టివ్‌గా ఉండలేరని భావిస్తున్నారా ? 


చంద్రబాబునాయుడు వయసు 70 ఏళ్లు దాయిపోయింది. ఆయన మహా అయితే 2024 ఎన్నికల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటారని..2029 ఎన్నికల నాటికి వయసు కారణంగా చురుగ్గా రాజకీయాలు చేయలేరని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇక రాజకీయ ప్రత్యర్థి ఉండరని జగన్ అనుకుంటున్నారని అంటున్నారు. లోకేష్ రాజకీయంగా జగన్‌తో ఢీ కొట్టే రేంజ్‌కు వెళ్లలేదని..అలాగే పవన్ కల్యాణ్‌కు అన్ని వర్గాల్లో ఆమోదం లభించదని.. వారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రమే టాల్ లీడర్‌గా ఉంటారని అందుకే.. ముఫ్పై ఏళ్ల పాటు జనానికి మరో ఆప్షన్ ఉండదని..తననే ఎన్నుకుంటారని జగన్ అంచనా వేస్తున్నారని అందుకే.. 30 ఏళ్ల కామెంట్లు చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే నాయకత్వం అనేది ప్రజల నుంచే వస్తుందని.. ఎవరూ ఉండరు.. రారు అనుకోడం ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని మర్చిపోవడమేనని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటే ఎవరినైనా లీడర్‌గా ఎన్నుకోవచ్చని  గుర్తు చేస్తున్నారు. 


గతంలో చంద్రబాబు కూడా ఇదే తరహా ప్రకటనలు.. కానీ ఆయన దృక్పధం వేరు !


చంద్రబాబు మొదటి రెండు సార్లు సీఎం అయినప్పుడు బెంగాల్‌లో సుదీర్ఘ కాలంగా జ్యోతిబసు సీఎంగా ఉండేవారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విజన్ ట్వంటీ 20 అనే ప్రణాళికతో చంద్రబాబు తాను కూడా సుదీర్ఘంగా సీఎంగా ఉండాలనుకున్నారు. తాను చేస్తున్న అభివృద్ధితో ప్రజలు తనను ఆదరిస్తారని.. ఇరవై .. పాతికేళ్ల పాటు సీఎంగా ఉంటానని అనుకునేవారు. కానీ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చంద్రబాబుకు మరో ఎన్నికలోనే తెలిసి వచ్చింది. ఇప్పుడు జగన్ కూడా 30 ఏళ్ల పాటు సీఎం ప్రకటనలు చేస్తున్నారు కానీ.. చంద్రబాబుతో పోలిస్తే ఆయన దృక్బథం వేరు. సంక్షేమపథకాల పేరుతో నగదు   బదిలీ చేస్తున్నామని.. తనకు పోటీ వచ్చే నాయకుడు ఉండరన్న కోణంలో ఆయన ధర్టీ ఇయర్స్ సీఎం రోల్‌పై ఆశలు పెంచుకుంటున్నారు. 


ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వారు చాన్స్ ఇవ్వాలనుకుంటే ఓడిపోకుండా ఇస్తారు. ఓడించాలనుకుంటే.. పరిపాలనతో సంబంధం లేకకుండా ఓడిస్తారు. కానీ.. ప్రజలతో  సంబంధం లేకుండా సీఎం పదవిపై ఆశలు పెట్టుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. చరిత్ర అదే చెబుతోంది.