Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Nov 2022 06:18 PM
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిన బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను విచారణకు హాజరవ్వాలని సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న సిట్ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 


 

తెనాలిలో దారుణం, భార్యపై కత్తితో దాడి చేసిన భర్త  

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ హత్య జరిగింది. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ,  దండేసి నివాళులు అర్పించాడు. ఆ తర్వాత స్థానిక పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ప్రణాళిక ప్రకారమే భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Nitin Gadkari: నితిన్ గడ్కరీకి అస్వస్థత, మరోసారి స్టేజీపై పడిపోయిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు పర్యటనలో ఉన్నారు. సిలిగురిలోని ఓ సభలో స్టేజీపై ఉండగానే పడిపోయారు. ఆయనకు ఒంట్లో షుగర్ లెవల్స్ తగ్గినట్లుగా వైద్యులు చెప్పారు. ఆ మేరకు ఆయనకు వైద్యం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా గడ్కరీ ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. వైద్యులతో ఫోన్ లో మాట్లాడి ప్రధాని ఆరా తీశారు.

అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్‌పై దాడి- విద్యార్థులు చూస్తుండగానే హత్యాయత్నం

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం జరిగింది. కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త కత్తితో దాడి చేశాడు. ప్రిన్సిపల్ రూమ్‌లో తంబ్ వేసి వస్తుండగా కత్తితో గొంతు కోశాడు భర్త పరేష్. 


అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు చూస్తుండగానే లెక్చరర్‌పై ఆమె భర్త దాడి చేశాడు. చంపేందుకు యత్నించి విఫలమయ్యారు. ఉదయాన్నే కాలేజీ వచ్చిన సుమంగళి... ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్లి హాజరు వేసుకొని వచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఆమె భర్త పరేష్‌.. ఒక్కసారిగా దాడి చేశాడు. 

TRS MLAs Buying Case: వల్లపల్లి తుషార్‌ కు సిట్ నోటీసులు, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని బీజేపీ నేత వల్లపల్లి తుషార్‌కు నోటీసులు ఇచ్చారు. నవంబరు 21న విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. రామచంద్రభారతి, పైలట్ తో తుషార్ ఫోన్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే. 

శ్రీశైలం: ఆలయ ఆర్జితసేవలలో పలు మార్పులు

  • శ్రీశైలం దేవస్థానం భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఆర్జితసేవలలో పలు మార్పులు

  • నేటి నుండి ఈనెల 23 వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల

  • నేటి నుండి రాత్రి 9 గంటలకు భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్న దేవస్థానం

  • శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమం యథావిధిగా కొనసాగింపు

  • శని, ఆది, సోమవారాలలో స్వామివారికి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్న దేవస్థానం

కాకినాడలో టీడీపీ లీడర్‌పై హత్యాయత్నం- మాలలో వచ్చిన దుండగుడు

కాకినాడలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న టీడీపీ లీడర్‌పై హత్యాయత్నం కలకలం రేపింది. భవానీ మాల వేసిన వ్యక్తి వచ్చి దాడి చేశాడు. ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి టీడీపీ లీడర్ శేషగిరి రావును ఆశీర్వదిస్తున్నట్టు నటిస్తూ అటాక్ చేశాడు. తన చేతిలో కనిపించకుండా క్లాత్‌ను కప్పి ఉంచాడు. శేషగిరిరావు దగ్గరికి వచ్చేసరికి దాడి చేశాడు. ప్రస్తుతం శేషగిరిరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Background

 పోలవరం ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలో అంటే 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే తెలంగాణ రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం పడుతుంది, ఎన్ని గ్రామాలు, ఎంత భూభాగం మునిగిపోతుందో పక్కాగా తెలుసుకునేందుకు ఉమ్మడి సర్వే చేయాల్సిందేనని తెలంగాణ మరోసారి గట్టిగా తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే తెలంగాణలోని భద్రాచలం నుండి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరు పక్కలా రాష్ట్ర పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురి అవుతాయని తమ ఇంజినీర్లు తేల్చారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ- పీపీఐ భేటీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


'892 ఎకరాల్లో సర్వే చేయాల్సిందే'


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. ముర్రెడు వాగు, కిన్నెరసానిలకు మాత్రమే పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో సర్వే జరిపించాలని ఈ మేరకు డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ - పీపీఏ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోలవరం ముంపు ప్రభావంపై వాడి వేడిగా చర్చించారు. ఏపీ నుండి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్, ఈఎన్సీ సి. నారాయణ రెడ్డి పాల్గొనగా.. తెలంగాణ నుండి నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్ కుమార్ భేటీకి హాజరయ్యారు. 


'పంపింగ్ బాధ్యతా ఏపీదే'


పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్ మాట్లాడుతూ.. పోలవరంతో తెలంగాణలో 300 ఎకరాలు మునిగిపోయే అవకాశం ఉందని, ముంపు ప్రభావంపై మరింత అధ్యయనం జరిపి నివారణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ- పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వే కోసం వచ్చిన ఏపీ అధికారులు.. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రెడువాగులపై పడనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరగా.. ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకుని మళ్లీ వస్తామంటూ తిరిగి వెళ్లి పోయారని మురళీధర్ గుర్తు చేశారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్ వాటర్ అడ్డంకిగా మారిందని.. దాని వల్ల ఆయా పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయని, తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలిపారు. గత సంవత్సరం జులైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40 వేల 446 ఎకరాలు వరదల్లో మునిగిపోయాయని వెల్లడించారు. అలాగే పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9 వేల 389 ఎకరాలు మునిగిపోతాయని వివరించారు. వరదలు, ముంపు ప్రభావంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘంతో అధ్యయనం చేయించాలని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్ కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భేటీలో ఆయన డిమాండ్ చేశారు. 


'ఏకాభిప్రాయం రాలేదు'


తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, అలాగే ఏపీ కూడా అంగీకారం తెలపలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రానందున కేంద్రం ఆధ్వర్యంలో మరోసారి భేటీ నిర్వహిస్తామని కేంద్ర సర్కారు చెప్పినట్లు గుర్తు చేశారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.