AP CM Chandra Babu Emergency Meeting Over Tirumala Stampede Issue: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తులు ఆరుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు సిఎం చంద్రబాబు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన దుర్ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు.  


ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు వారి సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు...అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. 


మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... రేపు తిరుమల వెళ్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరించిన జిల్లా అధికారులు... మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నట్టు వెల్లడించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలని సిఎం చంద్రబాబు సూచించారు. ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించాలని నిర్ణయించారు.  


వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడం ఆరుగురు మృతి చెందడం తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్."భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అని పవన్ సూచించారు.