Tirulama News: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజల అనంతరం ఈ రథం బయలుదేరింది. జనవరి 13 కుంభమేళా ప్రారంభం రోజు నుంచి ఫిబ్రవరి 26 కుంభమేళా పూర్తయ్యేవరకూ ఉత్తరాధి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని చెప్పారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. కలియుగ ప్రత్యక్షదైవంగా పూజలందుకున్న శ్రీ వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం దక్షిణాది భక్తులకు కల్పిస్తామని తెలిపారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీనివాసుడి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
12 ఏళ్లకు ఓసారి జరిగే కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈ మేరకు యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తనున్నారు. అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకకు బెదిరింపులు రావడంతో ఏడంచెల భద్రతా చర్యలు చేపట్టింది యూపీ సర్కార్.
మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాల గురించి తిరుమలలో అన్నమయ్య భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారని... పది రోజుల పాటూ టీటీడీ దర్శనాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. జనవరి ఉదయం 10 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచే సర్వదర్శనాలకు భక్తులను అనుమతిస్తామన్నారు. కేవలం వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామన్నారు. జనవరి 10వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటలవరకూ స్వర్ణరథంపై స్వామివారు దర్శనమిస్తారు.
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలు.. భారీగా పెరిగిన రద్దీ, భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం!
వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల సందర్భంగా ఈ పది రోజుల పాటు ప్రత్యేక సేవలు రద్దుచేశామని చెప్పారు బీఆర్ నాయుడు. వీఐపీలు నేరుగా వస్తే దర్శనానికి అనుమతిస్తాం కానీ..సిఫార్సు లేఖలు అనుమతించబోం అని మరోసారి స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేయాలనే ఈ నిర్ణయం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
మైసూర్ నుంచి వచ్చిన నిపుణులతో చేయించిన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. 3 వేల కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇక గోవిందమాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని..అందరి భక్తులతో పాటూ SSD టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
తిరుమలకు భక్తులను అనుమతించే విషయంలో ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని టీటీడీ ఛైర్మన్ పిలుపునిచ్చారు. ఇక HMPV అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్నందున భక్తులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!