Vaikunta Ekadasi Celebrations2025: జనవరి 10 ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆలయాలు భక్తులతో కళకళలాడిపోతాయ్..
జియాగూడ రంగనాథ స్వామి ఆలయం
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా నిర్వహిస్తారో..హైదారాబాద్ జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలోనూ అంతే వైభవంగా వేడుకలు సాగుతాయి. 400 సంవత్సరాల నాటి ఈ ఆలయాన్ని మూసీ నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడ శైలిలో నిర్మించారు. మూడు అంచెల రాజగోపురం కలిగి ఉండే ఈ ఆలయ గర్భగుడిలో రాతితో చెక్కిన శేషతల్పంపై సేదతీరుతున్న శ్రీ రంగనాథుడు దర్శనమిస్తాడు. ఇక్కడ రంగనాయకిగా కొలువైన శ్రీ మహాలక్ష్మి సహా ఇక్కడ ఆంజనేయస్వామి, గరుత్మంతుడి ఆలయాలను దర్శించుకోవచ్చు. గరుడ మందిరం వెనుక పంచలోహాలతో తయారుచేసిన ధ్వజస్తంభంపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు చెక్కి ఉంటాయి. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఏటా బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు కూడా కన్నుల పండువగా జరుగుతాయి. ఇక్కడ రంగనాథుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు పోటెత్తుతారు.
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!
హిమాయత్ నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం
హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనంకోసం భక్తులు పోటెత్తుతారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. తెల్లవారుజామునుంచి భక్తులు ఉత్తరద్వార దర్శనంకోసం బారులు తీరుతారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
జూబ్లీ హిల్స్ వేంకటేశ్వర స్వామి ఆలయం
హైదరాబాద్ లో ఉన్న మరో టీటీడీ ఆలయం జూబ్లీహిల్స్ లో ఉంది. తిరుమల శ్రీవారినే దర్శించుకుంటున్న అనుభూతిని ఇచ్చే ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే క్యూ లైన్లకోసం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదంతో పాటూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక్కడ కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!
చిలుకూరు బాలాజీ
చిలుకూరు బాలాజీ..లక్షల మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా వీకెండ్స్ లో భక్తులు పోటెత్తుతారు. ప్రత్యేక పండుగలు, పర్వదినాల్లో ఈ రద్దీ మరింత ఉంటుంది. హైదారాబాద్ వాసులు అయినా, హైదరాబాద్ వచ్చేవారు అయినా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు.
రత్నాలయం దేవాలయం
ప్రముఖ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో మరొకటి రంగారెడ్డి జిల్లా అలియాబాద్ లో ఉన్న రత్నాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు ఆండాళ్ దేవితో పూజలందుకుంటాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై కొలువై ఉంటాడు.
హైదరాబాద్ లో శ్రీ వేంకటేశ్వరుడి భక్తులు ముక్కోటి ఏకాదశి రోజు బిర్లామందిర్, జూబ్లిహిల్స్ లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇంకా నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న వైష్ణవ ఆలయాల్లోనూ స్వామివారి ఉత్తర ద్వార దర్శనంకోసం ఏర్పాట్లు చేస్తారు.
Also Read: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!