Tirumala News: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై టీటీడీ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు. బైరాగి పట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద ఒకరు. విష్ణునివాసం వద్ద మరొకరు, పద్మావతిపురంలో ఇంకొకరు చనిపోయారు.
వైకుంట ద్వార దర్శనం కోసం ఈ ఉదయం నుంచే రద్దీ మొదలైంది. భారీగా భక్తులు తరలి రావడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం నాలుగు ప్రాంతాల్లో తోపులాట జరిగింది. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద తోపులాట జరిగింది.
బైరాగి పట్టేడ రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన దుర్ఘటనలో ఈ దుర్ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తురాలు మృతి చెందింది. అదే ప్రాంతంలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి.
తిరుమలలో శుక్రవారం నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ దర్శనం కోసం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో టికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్ల కోసం ప్రతి కేంద్రంలో భారీగా భక్తులు క్యూ కట్టారు. అలానే విష్ణు నివాసం వద్ద పరిమితికి మించి భక్తులు రావడంతో తోపులాట జరిగింది.
దుర్ఘటన జరిగిన వెంటనే టీటీడీ అప్రమత్తమైంది. క్షతగాత్రులను అధికారులు పరామర్శించారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు. అపశ్రుతి చోటు చేసుకున్న ప్రాంతాన్ని కూడా టీటీడీ ఈవో శ్యామల రావు పరిశీలించారు. తోపులాటకు దారి తీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టికెట్ల జారీ గురువారం ఉదయం నుంచి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే టీటీడీ ప్రకటించిందీ అయినా భక్తులు ఇప్పటికే భారీగా చేరుకున్నారు. టోకెట్లను ఇచ్చే ప్రాంతాలు భక్తులతో నిండిపోయి ఉన్నాయి. టీటీడీ అధికారులు మాత్రం పది రోజులపాటు దర్శన భాగ్యం ఉంటుందని ఏకాదశి రోజునే చేసుకోవాలని ఏం లేదని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్లు ఇస్తారు. మూడు రోజులకు సంబంధించిన టోకెన్లు గురువారం ఇస్తారు. మిగిలిన రోజుల టికెట్లు ముందు రోజులు జారీ చేస్తారు. మూడు రోజులకు దాదాపు లక్షన్నర టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం తిరుమలలో 9 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ 9 కేంద్రాల్లో దాదాపు వంద వరకు కౌంటర్లు రెడీ చేశారు. ఇప్పటికే ఈ కౌంటర్ల లోకి జనం చేరుకున్నారు. మరికొందరు రోడ్లపైనే ఎదురు చూస్తున్నారు. రామచంద్ర పుష్కరిణి నుంచి స్విమ్స్ వరకు భక్తులు వేచి ఉన్నారు.