Telangana News: తెలంగాణలో మద్యం ప్రియులకు ముఖ్యంగా టీనేజర్లకు బిగ్‌షాక్ తగిలింది. కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. ఐదేళ్ల నుంచి మద్యం ధరల సవరించడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీని కారణంగా నష్టాలు వస్తున్నట్టు పేర్కొంది. అందుకే సరఫరా నిలిపేస్తున్నట్టు తెలిపింది. దీనికి తోడు తెలంగాణ బీసీఎల్ బకాయిలు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది. ఈ మేరకు సెబీకి రాసిన లేఖలో పేర్కొంది.
బీర్ల సంస్థ ప్రకటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. బీర్ల సంస్థ రేట్లను 33 శాతం పెంచమని అడుగుతోందన్నారు. ఇలా పెంచితే ఇప్పుడు 150 రూపాయలు ఉన్న బీర్ 250 రూపాయలు అవుతుందని తెలిపారు. బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెంచితే ప్రజల పై భారం పడుతుందన్నారు. రెట్లు పెంచే సిస్టం కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామని వివరించారు. కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
బేవరేజ్ సంస్థ గుత్తాధిపత్యంగా ప్రవర్తిస్తుందన్నారు. బకాయిలు గత ప్రభుత్వం నుంచి ఉన్నాయని జూపల్లి వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వందల కోట్లు చెల్లించామని ఇప్పుడు 650 కోట్లు పెండింగ్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో 2500 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని వివరించారు. 14లక్షల కేసులు ప్రస్తుతం స్టాక్ ఉందన్న మంత్రి.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ధర కొంత తక్కుగానే ఉన్నట్టు అంగీకరించారు. కర్ణాటక 190, ఏపీ 180 రూపాయలు బీరు రేటు ఉంటే.. తెలంగాణలో 150లో బీరు రేటు ఉందని వివరించారు. ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగదని...మేము వచ్చాక ఒక్క పైసా కూడా టాక్స్ పెంచలేదని గుర్తు చేశారు. బేవరేజ్ సంస్థకు 7 డిసెంబర్ 2023 నాటికి 407.34 కోట్లు బకాయిలు ఉన్నట్టు వెల్లడించారు. అప్పటి నుంచి జనవరి ఏడు 2025 వరకు 1130.99 కోట్ల బకాయిలు క్లియర్ చేశాని క్లారిటీ ఇచ్చారు. ఇంకా బేవరేజ్ సంస్థకు ప్రస్తుతం పెండింగ్ 658.95 కోట్లు ఉన్నట్టు తెలిపారు.
తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేయడంపై బీఆర్‌ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీష్‌రావు..... ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్టు అనిపిస్తుందని అన్నారాయన. బూం బూం, బిర్యానీ లాంటి లోకల్ బ్రాండ్లను ప్రోత్సహించేందుకే ఇలాంటి ఎత్తుగడలు చేస్తున్నారా అని డౌట్ వ్యక్తం చేశారు.
"యునైటెడ్ బ్రూవరీస్ తెలంగాణ ప్రభుత్వానికి బీర్ అమ్మకాలను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెలంగాణ ప్రభుత్వ లిక్కర్ సంస్థ అయిన TGBCL బీర్ సరఫరాదారులకు బకాయిలు చెల్లించడంలో విఫలమైందని UB పేర్కొంది. యునైటెడ్ బ్రూవరీస్ బీర్ విక్రయాలను నిలిపివేయడం వల్ల తెలంగాణలో కింగ్‌ఫిషర్, హీనెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్‌ల లభించవు. బూమ్ బూమ్ బీర్ , బీర్యానీ బీర్ వంటి స్థానిక బ్రాండ్‌లను ప్రోత్సహించేందుకే చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నమేనా? సీనియారిటీ లేదా మెరిట్‌కు కట్టుబడి బిల్లులను క్లియర్ చేయడంలో విఫలమైన ప్రభుత్వం తమ “ప్రాధాన్యత” కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా? (BRS ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా బిల్లులను క్లియర్ చేసేది.)" అని అన్నారు.