Job Notifications in Telangana : తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - టీజీపీఎస్సీ (Telangana Public Service Commission - TGPSC) ప్రకటించింది. దాంతో పాటు మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పింది. అధికారులు ఇచ్చిన ఖాళీల వివరాలను తనిఖీ చేసి  నోటిఫికేషన్ జారీపై ఏప్రిల్ లో కసరత్తు చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. దాంతో పాటు త్వరలోనే గ్రూప్ - 1,2,3 ఫలితాలు కూడా విడుదల చేస్తామని చెప్పింది.


ఏప్రిల్ తర్వాతే ఉద్యోగాలకు నోటిఫికేషన్స్


రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగా నోటీఫికేషన్స్ (Notifications)ను జారీ చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేషం తెలిపారు. మార్చి 31, 2025లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ ఫలితాలిస్తామని.. ఏప్రిల్ 2025 తర్వాతే నోటిఫికేషన్స్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో భర్తీపై స్టడీ చేసి.. మే 1 నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. అంతకంటే ముందు ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఆ తర్వాత వెంటనే పరీక్షలు నిర్వహించి.. ఏ పరీక్ష ఫలితాలు పూర్తయితే వాటిని వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా ఫలితాలు, భర్తీ విషయంలో ఆలస్యం జరగదన్నారు. నోటిఫికేషన్స్ ఇచ్చిన 6 నుంచి 8 నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.


వారం రోజుల్లోనే గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ 


ఇటీవల పలు శాఖల్లో భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ - 1, 2, 3 పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేషం అన్నారు. వచ్చే వారం, 10 రోజుల తేడాతో రిజల్ట్స్ ను విడుదల చేస్తామని చెప్పారు. టీజీపీఎస్సీ సిలబస్ పైనా అధ్యయనం చేస్తున్నామన్న ఆయన.. గ్రూప్ - 3కి 3,4 పేపర్లు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ(UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) ఫార్మాట్ లో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగాలను బట్టి కంప్యూటర్ బేస్డ్, మాన్యువల్ ఫార్మాట్ లో ఎగ్జామ్స్ పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వెంకటేషం తెలిపారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారుస్తామని.. క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసి.. దాని నుంచే ప్రశ్న పత్రాలు తయారు చేస్తామని చెప్పారు. గతంలో జరిగిన అవకతవకలపైనా బుర్రా వెంకటేషం స్పందించారు. ఇంతకుముందు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. టీజీపీఎస్సీపై నమ్మకం ఉంచాలని, అపోహలు వీడాలని కోరారు.


ఉద్యోగాల భర్తీపై హైకోర్టు ప్రకటన


ఉద్యోగాల భర్తీపై హైకోర్టు (High Court) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,673 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఈ రోజు (జనవరి 8) నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఇందులో 1277 టెక్నికల్, మరో 184 నాన్ టెక్నికల్ కోటాలో ఉద్యోగాలున్నాయి. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులు భర్తీ చేయనున్నారు.


Also Read : Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?