Hyderabad ORR tenders | హైదరాబాద్: ఓవైపు ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుస నోటీసులు ఇస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసుతో ఆయన సతమతం అవుతుంటే ఏసీబీకి మరో ఫిర్యాదు వచ్చింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road) టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు వచ్చింది.
బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు, వనపర్తి జిల్లాకు చెందిన యుగంధర్ గౌడ్ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఫార్ములా ఈ రేసులో ఏసీబీ గురువారం విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఇదివరకే నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను చేర్చిన ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది.
దర్యాప్తు ముమ్మరం చేసిన ఏసీబీ, ఈడీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఆ సమయంలో పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అయిన అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎన్‌ఎల్ రెడ్డిలకు నోటీసులు రాగా, బుధవారం నాడు ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి ముందే అధికారులను ప్రశ్నించి కొన్ని కీలక విషయాలు రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ, ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే తన తప్పు లేదని, నిధులు దుర్వినియోగం జరగలేదని తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేయడంతో పాటు తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.