Telangana CM Revanthh Reddy | హైద‌రాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం త్వరలో విస్తరించనున్న మెట్రో రైలు మార్గాల‌కు సంబంధించి స‌మ‌గ్ర ప్ర‌ణాళికలు (DPR) మార్చి నాటికి పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మూడు మార్గాల మెట్రోల డీపీఆర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం పొందాలన్నారు. ఏప్రిల్ నెలాఖ‌రుకు ప్రాజెక్టు నిర్వహణకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సూచించారు.


హైదరాబాద్ మెట్రో విస్తరణపై అధికారులతో సమీక్ష


హైద‌రాబాద్ లో మెట్రో విస్త‌ర‌ణ‌, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి త‌న నివాసంలో మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (Shamshabad Airport)- ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో (40 కిలోమీటర్లు),  జేబీఎస్‌- శామీర్‌పేట మెట్రో మార్గం (22 కి.మీ.), ప్యార‌డైజ్- మేడ్చ‌ల్ మెట్రో రూట్ (23 కి.మీ.) కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయానికొస్తే భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాల‌న్నారు. మేడ్చ‌ల్ మార్గంలో నేషనల్ హైవే మార్గంలోని 3 ఫ్లైఓవర్ల‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 


రెండు మెట్రోలు ఒకేచోట ప్రారంభం..


శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభ‌మయ్యేలా చూసుకోవాల‌న్నారు. అలా చేస్తే అధునాతన వ‌స‌తులు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భారీ జంక్ష‌న్  ఏర్పాటు చేయవచ్చునని రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆయా ప్రాంతాల వారు న‌గ‌రంలోకి రాన‌వ‌స‌రం లేకుండా అక్క‌డే అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయాల‌న్నారు. జంక్ష‌న్‌కు సంబంధించిన పూర్తి ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయాల‌ని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGIL) కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస రాజు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, హైద‌రాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌, HMDA క‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మాల క‌మిష‌న‌ర్ శ‌శాంక త‌దిత‌రులు పాల్గొన్నారు.