Jaiveer Shergill Resigns:
చాలా రోజులుగా మౌనం..
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జాతీయ ప్రతినిధి పదవి నుంచి జైవీర్ షేర్‌గిల్ తప్పుకున్నారు. రాజీనామా చేస్తున్నందుకు తనను క్షమించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. క్షేత్రస్థాయిలోని నిజానిజాలను పట్టించుకోకుండా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు జైవీర్. ఇలా రాజీనామా చేయటం తనకెంతో బాధగా ఉందని అన్నారు. సుప్రీం కోర్టులో న్యాయవాదిగానూ పని చేస్తున్నారు జైవీర్ షేర్‌గిల్. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే...తన ట్విటర్ హ్యాండిల్ బయోలో కాంగ్రెస్ పేరుని తొలగించారు.
నిజానికి ఆయన మౌనంగా ఉండటంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలలుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లోనూ పాల్గొనటం లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ తమ పదవులకు రాజీనామా చేయగా..ఇప్పుడు జైవీర్ కూడా అదే బాటలో నడిచారు. "అవమానాలు భరించలేక రాజీనామా చేస్తున్నా" అని పార్టీ హిమాచల్ ప్రదేశ్ ప్యానెల్ చీఫ్ ఆనంద్ శర్మ వెల్లడించారు. పార్టీ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. "హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయటం చాలా బాధగా ఉంది. నేనెప్పటికీ కాంగ్రెస్ మనిషినే. కాంగ్రెస్ ఐడియాలజీ నాలో నిండిపోయింది. కేవలం అవమానాలు భరించలేక, ఆత్మగౌరవం చంపుకోలేక ఈ పదవి నుంచి తప్పుకుంటున్నా" అని ఆనంద్ శర్మ వరుస ట్వీట్‌లు చేశారు.
వరుస రాజీనామాలు..
కాంగ్రెస్ పార్టీ ఇంతలా డౌన్‌ఫాల్ అవడానికి కారణం..అంతర్గత కలహాలు. తమకు పార్టీలో ప్రాధాన్యతే లేదని సీనియర్లు ఎప్పటి నుంచో అలక వహిస్తూనే ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా..ఎందుకో అది వర్కౌట్ అవటం లేదు. తరచూ ఇది కనిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఎప్పటి నుంచో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన పని, ఆయనలోని అసహనాన్ని తెలియజేసింది. జమ్ముకశ్మీర్‌లో పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్‌గా గులాం నబీ ఆజాద్‌ను నియమించింది అధిష్ఠానం. ఇలా నియమించిన కాసేపటికే ఆ పదవికి రాజీనామా చేశారాయన. అంతే కాదు. జమ్ముకశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నుంచి కూడా తప్పుకున్నారు. రెండేళ్ల క్రితం పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ప్రక్షాళణ అవసరం అని అందులో తేల్చి చెప్పారు. సోనియాకు లేఖ రాసిన వారిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఆయనే కాదు. గత నెల జమ్ము కశ్మీర్ పార్టీ చీఫ్ పదవి నుంచి గులాం అహ్మద్ మీర్ నుంచి తప్పుకున్నారు. గులాం అహ్మద్, గులాం నబీ ఆజాద్ మంచి మిత్రులు. ఈ ఇద్దరు మిత్రులు వరుసగా కీలక పదవుల నుంచి తప్పుకోవటం అధిష్ఠానాన్ని కలవర పెడుతోంది. జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకున్న మీర్ రాజీనామాకు అధిష్ఠానం ఆమోదించింది. ఆయన స్థానంలో వికర్ రసూల్ వనీని నియమించింది.
Also Read: MLC Kavita : లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు చేయవద్దు - హైదరాబాద్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు !
Also Read: CBI Raid: తేజస్వీ యాదవ్ మాల్‌లో సీబీఐ సోదాలు, అసెంబ్లీ స్పీకర్ రాజీనామా - బిహార్‌లో ఏం జరుగుతోంది?