కోలీవుడ్ లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన 'విక్రమ్ వేద'(Vikram Vedha) సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిగిలిన భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో కూడా సినిమా రీమేక్ అవుతుందని అన్నారు. అయితే ముందుగా హిందీ రీమేక్ మొదలైంది. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్నారు. భూషణ్ కుమార్ టీసీరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్, ఎస్‌.శ‌శికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా నుంచి హృతిక్ రోషన్ లుక్ ని, సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ను విడుదల చేశారు. అవి ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. తాజాగా సినిమా టీజర్ ని వదిలారు. సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan), హృతిక్ రోషన్(Hrithik Roshan) మధ్య జరిగే సంభాషణతో టీజర్ ని మొదలుపెట్టారు. 'మీకో కథ చెప్పమంటారా సర్..? జాగ్రత్తగా, ఓపికగా వినండి. ఈసారి కథ కేవలం సరదాగా మాత్రమే ఉండదు.. ఓ సర్ప్రైజ్ కూడా ఉంది. మంచి, చెడులలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ.. కానీ ఈ కథలో ఇద్దరూ చెడ్డవాళ్లే' అంటూ హృతిక్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. 


కథ ప్రకారం.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సైఫ్ అలీఖాన్, గ్యాంగ్ స్టర్ గా హృతిక్ రోషన్ నటించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. అయితే ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి సినిమా ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. టీజర్ ని బట్టి చూస్తుంటే ఒరిజినల్ వెర్షన్ కి జెరాక్స్ కాపీలా అనిపిస్తుంది.   


ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. 'విక్ర‌మ్‌ వేద' ఒరిజిన‌ల్‌ వెర్షన్ కు క‌థ రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్క‌ర్‌, గాయత్రి.. ఈ హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్ ని బట్టి సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. విక్ర‌మ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన నియో-నాయ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఒక పోలీస్‌.. గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



బాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారా..?


ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎలాంటి సినిమా విడుదలవుతున్నా.. వర్కవుట్ కావడం లేదు. పైగా 'విక్రమ్ వేద' ఒక రీమేక్ కథ. ఒరిజినల్ వెర్షన్ ఓటీటీ, యూట్యూబ్ లలో అవైలబుల్ గా ఉంది. చాలా మంది ఈ సినిమాను చూసేశారు. పోనీ రీమేక్ లో ఏదైనా కొత్తదనం ఉందా..? అంటే అలా కనిపించడం లేదు. ఉన్నది ఉన్నట్లుగా తీసినట్లున్నారు. మరి ఈ సినిమాకి బాలీవుడ్ లో ఏ మేరకు ఆదరణ దక్కుతుందో చూడాలి. ఒకప్పడు హిందీలో రీమేక్ సినిమాలు చేస్తే.. జనాలు థియేటర్లకు వెళ్లి చూసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ అన్ని భాషల సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల 'విక్రమ్ వేద' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించగలదో లేదో చూడాలి!


Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి


Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ