Congress Party New Chief: 


ఆగస్టు 28న సమావేశం


కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు వర్కింగ్ కమిటీ ఆగస్టు 28న సమావేశం కానుంది. వర్చువల్‌ మీటింగ్‌లో భాగంగా...కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల తేదీని నిర్ణయించనుంది. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ...ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ ట్విటర్‌లో వెల్లడించారు. అయితే..ఈ మీటింగ్‌కు ముందుగానే ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. సోనియా గాంధీ..సీనియర్ నేత అశోక్ గెహ్లోట్‌ను కలిశారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని సోనియా..అశోక్‌ను అడిగారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపటం లేదు. వయసు, ఆరోగ్యం రీత్యా ఈ పదవిని చేపట్టలేనని ఆయన ముందే క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా...సోనియా గాంధీ..అశోక్ గెహ్లోట్‌ను పార్టీ బాధ్యతలు తీసుకోవాలని అడిగారు. అయితే...ఇందుకు గెహ్లోట్ ఆసక్తి చూపలేదు. "రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం" అని చెప్పారు.





 


రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి..


"నేనెప్పటి నుంచో ఒకటే విషయం చెబుతున్నాను. కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసేది రాహుల్ గాంధీయే. ఆయన లేకపోతే, ప్రత్యక్షంగా వచ్చి పోరాడకపోతే ప్రజలు అసంతృప్తికి గురవుతారు. పార్టీ కూడా వీక్ అయిపోతుంది. మా అందరి అభిప్రాయాలను గౌరవించి, రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపడితే బాగుంటుంది" అని ఇటీవలే అశోక్ గెహ్లోట్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు. ఆయనే అధ్యక్ష పదవి చేపట్టాలని రాహుల్‌ని బతిమాలతామనీ అన్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించకపోతే...ఇంకెవరినీ బలవంతంగా ఆ కుర్చీలో కూర్చోపెట్టకూడదు అని వ్యాఖ్యానించారు. 


భారత్ జోడో యాత్ర 


ఆగస్టు 28న  ఈ అధ్యక్ష ఎన్నికలతో పాటు భారత్ జోడో యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌పైనా చర్చించే అవకాశముంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమై...కశ్మీర్‌లో ముగియనుంది ఈ యాత్ర. ఈ ఏడాది మేలో ఉదయ్‌పూర్‌లోని చింతన్ శివిర్ వద్ద "భారత్ జోడో యాత్ర"కు (Bharat Jodo Yatra) సంబంధించిన ప్రకటన చేశారు అధినేత సోనియా గాంధీ. 5 నెలల పాటు సాగనున్న ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో జరగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..ఈ పాదయాత్రలు, ర్యాలీలు సహా పబ్లిక్ మీటింగ్స్‌లోనూ పాల్గొననున్నారు. ఈ ఏడాది జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కోల్పోయిన తన ప్రాభవాన్ని మళ్లీ సాధించాలంటే...ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది హస్తం పార్టీ. అందుకే...ఈ యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలని చాలా గట్టి సంకల్పంతో ఉంది కాంగ్రెస్. ఆగస్టు 22 న రాహుల్ గాంధీ...పలువురు నిపుణులు, సంస్థలను మీటింగ్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. సలహాలు, సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా తదుపరి ఎన్నికల ప్రణాళికలు రచించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్‌ జోడో యాత్ర గురించీ వారితో చర్చించే అవకాశముంది. విభిన్న రంగాలకు చెందిన వారితోనూ రాహుల్ గాంధీ సమావేశమవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: Hyderabad Old City:నిఘా నీడలో పాతబస్తీ- భారీగా పోలీసుల మోహరింపు


Also Read: Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ప్రకటించిన కాంగ్రెస్ | ABP Desam