Hyderabad Old City: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాత బస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ... పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చారు. చార్మినార్, మొగల్ పురాస శాలిబండ, చంచల్ గూడ, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాడ్ బజార్, మీర్ చౌక్, దారుల్ ఫిషా, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగాయి.
శాలిబండ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మొగల్ పురా ప్రాంతంలో పోలీసులపై వాహనాలపై నిరసన కారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న టైంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
నిరసనల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదోళనకారులు విధ్వంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. వేకువజామున నాలుగు గంటల వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోని పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి శాలిబండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మళ్లీ పరిస్థితి చేయిదాటిపోకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అటువైపు ఎవరినీ రాయనీకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
రాజాసింగ్ కు బెయిల్ ఎందుకిచ్చారు..?
ముసాభౌలీ, హుస్సునీ ఆలం, చార్మినార్, శాలిబండ నుంచి ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని సిటీ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సిటీ కాలేజీ నుంచి బేగంబజార్, హైకోర్డుకు వెళ్లే రహదారులను బ్లాక్ చేశారు. అయినా వినని నిరసనకారులు... మహమ్మద్ ప్రవక్తపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ కు బెయిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ల మనోభావాలను దెబ్బ తీసినందుకు గాను.. ఎమ్మెల్యే రాజాసింగ్ ను జైల్లో వేసి.. కఠినంగా శిక్షించాలన్నారు. పాతబస్తీ పరిస్థితులపై దక్షిణ మండల డీసీపీ, అదనపు డీసీపీ, ఎస్బీ అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఎస్సైలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
రాజాసింగ్ కు బెయిల్..
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనకు బెయిల్ తిరస్కరించారని.. రిమాండ్‌కు తరలించారన్న ప్రచారం జరిగింది. కానీ న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. 41 సి అర్ పి సి కండిషన్ ను పోలీసులు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో రాజాసింగ్ రిమాండ్ ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశించింది.
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్టానం..
మహమ్మద్ ప్రవక్తపై ఎమ్మెల్ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో దుమార రేగింది. దీంతో ఆయనను బీజేపీ నుంచే సస్పెండ్ చేశారు. పది రోజుల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. అయితే కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద మునావర్ షో ఇవ్వడానికి వచ్చినందున పోలీసులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని షోను సక్సెస్ చేశారు. రెండు రోజుల పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. దానికి ప్రతీకారంగానే ఆయన వీడియో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇది తెలంగాణ తీవ్ర దుమారం రేపింది.