తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని తీసుకుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగానే  గృహ నిర్భంధంలో ఉన్న బండి సంజయ్ కుమార్.. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో ఉన్న తన నివాసంలో ‘‘నిరసన దీక్ష’’ చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే.. దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ ను అక్రమంగా నిర్బంధించారని చెబుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ వస్తుండటం, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు చెబుతున్నారు. 


బీజేపీ నిరసన దీక్ష..


జిల్లా హెడ్ క్వార్టర్స్, మండల కేంద్రాలు, హైదరాబాద్‌లో ఈ నిరసన దీక్షలు చేయనున్నారు. కరీంనగర్ జోత్యి నగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న బండి సంజయ్ అక్కడే నిరసన దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.


నిరంకుశ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు..


లిక్కర్ స్కాంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకుని బండి సంజయ్ ను అక్రమంగా నిర్బంధించారనే అంశాన్ని ఈ నిరసన దీక్ష సందర్భంగా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుండటం, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు ఇలా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, కేసీఆర్ కుటుంబ-నియంత-అవినీతి పాలనకు నిదర్శనమనే సంకేతాలను సైతం మరోసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది.  






బండి సంజయ్ గృహ నిర్బంధం..


ప్రజాసంగ్రామ యాత్ర చేస్తూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు వద్ద ధర్మ దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. బండి సంజయ్ గృహ నిర్బంధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 


అందుకే గృహ నిర్బంధం..


హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇది అక్రమమంటూ బండి సంజయ్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు నల్ల బ్యాడ్జీ ధరించారు. అనంతరం ధర్మ దీక్షకు కూర్చున్నారు. కవిత ఇంటి ముందు బీజేపీ శ్రేణులు నిరసన తెలపడాన్ని వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బండి సంజయ్ పాదయాత్ర వద్దకు వస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సుమారు 300 మంది పోలీసుల బలగాలను మోహరించి బండి సంజయ్ దీక్షను భగ్నం చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కరీంనగర్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.