Sri Malakonda Lakshmi Narasimha swamy: నరసింహ స్వామి తొమ్మిది అవతారాలుగా ఉద్భవించి వివిధ ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నవ నరసింహుల్లో ఒకరు మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి. దేవేరి శ్రీ మహాలక్ష్మీతో పాటు కొలువై ఉండి భక్తుల కోర్కెలు తీర్చే ఈ స్వామివారి దర్శనం వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. నెల్లూరు జిల్లా వలేటివారి పాలెం మండలంలో ఉన్న మాలకొండ పై జ్వాలా నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. సాధారణంగా అన్ని ఆలయాలు ఉదయం సాయంత్రం భక్తులకు దర్శనం కల్పిస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామి వారి దర్శనం కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. దీనివెనుక పురాణగాథ ఉంది.

  


పురాణగాథ
పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని భూలోకంలో ఈ ప్రాంతంలో కొలువై భక్తులను దర్శనం ఇవ్వాలని లక్ష్మీదేవి కోరిందట. ఆమె కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ మాల్యాద్రి నరసింహుడిగా వెలిశాడని అంటారు. అగస్త్య మహాముని తాను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం మాల్యాద్రి కొండ అని భావించి ఈ కొండపైకి వచ్చి తపస్సు చేశాడని కూడా కథనం. అగస్త్యుడి కోరిక మేరకు కలికాలంలో ప్రజల పాపాలు పటాపంచలు చేసి వారిని రక్షించేందుకు స్వామి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారని అంటారు. మునులు, దేవతలు, యక్షులు, కిన్నెర, కింపురుషాదులకు ప్రతి రోజు స్వామివారి దర్శనమిస్తారట. వారంలో ఒకరోజు, కేవలం శనివారం మాత్రమే మిగతా వారికి దర్శనమిస్తారట. ఈ కొండపై వెలసిన స్వామి వారి దర్శనం చేసుకుంటే వారి పాపాలు తొలగిపోయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.


Also Read:  వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!


బండరాళ్ల మధ్య దారి
స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకునేందుకు మెట్లమార్గం ఉంది..వాహనాలు వెళ్లే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కొండపై ఉన్న రెండు పెద్ద బండ రాళ్ల మధ్య దారి ఉంటుంది. ఎంత లావుగా ఉన్నవారైననా, సన్నగా ఉన్నవారైనా ఈ దారిలో వెళ్లేటప్పుడు రాళ్ల మధ్యనుంచి వెళ్లేటప్పుడు రాళ్లు శరీరానికి తాకుతున్నట్టు ఉంటాయి. వారంలో ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండడంతో ప్రతిశనివారం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంటుంది. భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతుల కోసం ఆలయ అధికారులు 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 10 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి టెండర్లు పిలిచారు. త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కాబోతున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. 


Also Read:  శక్తి గణపతి - ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే వెళ్లలేరు స్వామి పిలిస్తేనే వెళ్లగలరు


హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి, శాంతించి లక్ష్మీనరసింహునిగా దర్శనమిస్తాడు విష్ణుమూర్తి. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే, తనని కొలిచిన ప్రతి భక్తునీ అదుకుంటానని అభయమిస్తాడు. నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి, కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
‘ఓం నమో నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు 
‘నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్‌’ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తే అనారోగ్యం, ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట.
‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం’ 
అనే మంత్రాన్ని పఠిస్తే మృత్యుభయం పోతుందని చెబుతారు.