Ankita Bhandari Murder Case: ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారి కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆమె తల్లిదండ్రులకు రూ.25 లక్షలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ప్రకటించింది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో
ఈ కేసులో అంకిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం అంకిత హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలని ధామీ.. న్యాయస్థానాన్ని కోరినట్లు సీఎంఓ తెలిపింది. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ జరిగింది
ఉత్తరాఖండ్‌లో అంకిత భండారి అనే యువతి మృతి సంచలనం సృష్టించింది. హరిద్వార్‌కు చెందిన భాజపా నేత వినోద్ ఆర్య తనయుడు పుల్కిత్ ఆర్య యమకేశ్వర్‌లో వనతార రిసార్ట్‌ను నడుపుతున్నాడు. రిసార్ట్‌లో పౌరి జిల్లా శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుండేది. సెప్టంబర్ 19న ఆమె ఇంటికి రాలేదని అంకిత తండ్రి ఉదయపుర్ తల్లాలోని రాజస్వ చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా ఉన్నారు. మొదట కేసు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన నిందితులు.. పోలీసులు తమశైలిలో ప్రశ్నించేసరికి నిజాన్ని చెప్పేశారు.
మద్యం తాగించి
అంకితా భండారీని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించినట్లు నిందితులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అంకితను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశామని చెప్పారు. అంకితతో విభేదాలు రావడం వల్ల ఆమెను హత్య చేసినట్ల విచారణలో ఒప్పుకున్నారు.
కాలువలో యువతి మృతదేహాన్ని గాలించేందుకు పోలీసులు ఓ టీమ్‌ను పంపించారు. అంకిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ మృతదేహం అంకితదే అని ధ్రువీకరించారు.
అందుకే హత్య
రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు అంకిత భండారిని అతిథులకు ప్రత్యేక సేవలు అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ రిసార్టులో వ్యభిచారం నిర్వహించేవారని, ఆ కూపంలోకి దిగేందుకు నిరాకరించడం వల్లే అంకితను హత్య చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అంకితతో కలిసి పని చేసిన సహోద్యోగి ఒకరు తెలిపారు.
Also Read: Viral Video: ఉడతను చూసి పారిపోయిన ఉక్రెయిన్ సైనికులు!
Also Read: Soldier Mykhailo Dianov: రష్యా చేతికి చిక్కితే ఇదీ పరిస్థితి! ఉక్రెయిన్ జవాన్ షాకింగ్ ఫొటో!