Viral Video: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 7 నెలలు పూర్తయింది. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నిర్విరామంగా కొనసాగుతోంది. రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొడుతున్నారు. కుటుంబాలకు దూరమై ఉక్రెయిన్ సైనికులు దేశంగా కోసం పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఉడుత వారిని కాసేపు ఆటపట్టించింది.
ఉడతా ఉడతా ఊచ్
కొంతమంది ఉక్రెయిన్ సైనికులు తమ శిబిరం దగ్గర సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఓ ఉడత వారి దగ్గరికి వచ్చింది. వారిపైన ఎక్కి అటుఇటూ తిరిగింది. ఆ తర్వాత ఓ సైనికుడి వెంట పరిగెత్తింది. ఆ జవాను కూడా సరదాగా దాని నుంచి తప్పించుకుని తిరిగాడు. కాసేపటి తర్వాత మిగిలిన సైనికులను కూడా ఆట పట్టించింది ఉడత. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్యా నిర్ణయం
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను తీవ్రతరం చేస్తోంది. ఇందుకోసం రష్యాలో నిర్బంధ సైనిక సమీకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారినే కాకుండా వివిధ వర్గాల పౌరులను కూడా ఇందుకు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రైతులను కూడా సైన్యంలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులతో తాజాగా జరిగిన సమావేశంలో పుతిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది 'రిజర్వ్స్' తిరిగి పిలుస్తున్నామన్నారు. గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని 'రిజర్వ్స్' అంటారు. వీరి సేవలను ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఉపయోగించుకోనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ అన్నారు.
" ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో 'రిజర్వ్స్' సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఉక్రెయిన్‌లోని దోన్బస్ రీజియన్‌లో ఉన్న మా వారిని రక్షించుకోవడం రష్యా బాధ్యత. అలాగే దేశంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు నిధుల కేటాయింపును పెంచాం. ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం. "
Also Read: Soldier Mykhailo Dianov: రష్యా చేతికి చిక్కితే ఇదీ పరిస్థితి! ఉక్రెయిన్ జవాన్ షాకింగ్ ఫొటో!