Amritpal Singh Arrest:


కీలక ఆధారాలు..


పరారీలో ఉన్న ఖలిస్థాన్ వేర్పాటు ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్‌ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పంజాబ్ పోలీసులు. నలుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. అమృత్ పాల్‌కు పాకిస్థానీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISISతో సంబంధాలున్నట్టు వెల్లడించారు. అమృత్‌సర్ డీఐజీ స్వపన్ శర్మ ఈ సంచలన ప్రకటన చేశారు. 


"అమృత్‌ పాల్‌ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అతడిని ఛేజ్ చేశాం. మమ్మల్ని ఓవర్ టేక్ చేస్తూ ఆరు బైక్‌లను ఢీకొడుతూ వెళ్లిపోయాడు. కొందరు మమ్మల్ని ఆపేందుకు ప్రయత్నించారు. అలా మా కళ్లు గప్పి తప్పించుకున్నాడు. మెహత్‌పూర్‌లో రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాం. వీటితో పాటు 7 గన్స్‌నీ రికవర్ చేశాం"


- స్వపన్ శర్మ, అమృత్‌సర్ డీఐజీ










ఇప్పటికే అమృత్ పాల్‌ సలహాదారు దల్జిత్ సింగ్ కల్సీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతని ఫోన్‌లో పాకిస్థాన్‌కు చెందిన నంబర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఆ నంబర్‌లను ట్రేస్ చేస్తున్నారు. ఈ నంబర్‌ల నుంచి దాదాపు రూ.30 కోట్లు ఫండ్స్‌ అందినట్టు సమాచారం. మొత్తం 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల ఫోన్‌లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే అమృత్‌ పాల్‌ను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టిన వెంటనే అక్కడ ఇంటర్నెట్‌ను ఆపేశారు. అయితే...ఇప్పుడు ఈ ఆంక్షల్ని పొడిగించారు. రేపటి(మార్చి 20) వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు SMS సర్వీస్‌లపైనా ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 


Also Read: రాహుల్ హద్దులు దాటి మాట్లాడారు, డెమొక్రసీపై నమ్మకం లేని వాళ్లకు ఇక్కడ చోటు లేదు - జేపీ నడ్డా