WPL 2023, RCB: డబ్ల్యూపీఎల్ లో  ఆడిన తొలి ఐదు మ్యాచ్ లలో ఓడిపోయి  ‘అసలు ఈ టీమ్ గెలుస్తుందా..?’అన్న నిరాశవాదం నుంచి పుంజుకున్న  జట్టు   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.   ఐదు మ్యాచ్ లలో ఓటముల తర్వాత  యూపీ, గుజరాత్‌లను ఓడించిన  ఆర్సీబీ ఒక్కసారిగా ప్లేఆఫ్స్  రేసులో తాను కూడా ఉన్నానని దూసుకొచ్చింది.  సుడిగాలిలో దీపంలా మిణుకుమిణుకుమంటున్న  ఆ అవకాశాలేంటో ఇక్కడ చూద్దాం. 


యూపీ వారియర్స్ తో ఈనెల 15 న మ్యాచ్ గెలిచిన తర్వాత  ఆర్సీబీ  ప్లేఆఫ్ అవకాశాలు తాను ఆడే మ్యాచ్ లతో పాటు ఇతర జట్లపైనా ఆధారపడి ఉండేవి.  ముఖ్యంగా ముంబై.. తాను ఆడబోయే మూడు మ్యాచ్ లలో గెలవాల్సి ఉండేది.  కానీ  నిన్న (శనివారం)  యూపీ వారియర్స్ తో మ్యాచ్ లో ముంబై ఓడింది.  అయితే  ముంబై ఈ మ్యాచ్ లో ఓడినా ఆర్సీబీకి ఇంకా  ప్లేఆఫ్ అవకాశాలు మిగిలే ఉన్నాయి.  


ప్లేఆఫ్ రేసు ఇలా.. 


- ఆర్సీబీ తర్వాత ఆడబోయే  మ్యాచ్ ముంబైతో. ఈ  పోరులో బెంగళూరు గెలవాలి. 
- గుజరాత్ జెయింట్స్  జట్టు యూపీ వారియర్స్ ను ఓడించాలి. 
- ఢిల్లీ క్యాపిటల్స్ కూడా యూపీని ఓడించాలి.   


అంటే యూపీ తాము  తర్వాత ఆడబోయే రెండు  మ్యాచ్ లలో ఓడి.. ఆర్సీబీ, ముంబైపై గెలిస్తే అప్పుడు  పాయింట్ల పట్టికలో ముంబై మూడు విజయాలతో   మూడో స్థానంలోకి వస్తుంది.   వాస్తవానికి యూపీ కూడా ఈ లీగ్ లో   ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడి  మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఉంది. ఆర్సీబీ.. ముంబైపై గెలిచినా ఆరు పాయింట్లే వస్తాయి. అయితే  గుజరాత్, ఢిల్లీల చేతిలో  యూపీ భారీ తేడాతో ఓడితే  అప్పుడు  ఆ జట్టు నెట్ రన్ రేట్ మరింత పడిపోతుంది.  ఆర్సీబీ కూడా ముంబైపై  ఘన విజయం సాధిస్తే దాని  నెట్ రన్ రేట్ మరింత మెరుగుపడుతుంది. అప్పుడు ఆర్సీబీ మూడో స్థానానికి వచ్చి  ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.  


నిబంధనలు ఇలా.. 


 ప్లేఆఫ్స్ కు ఇప్పటికే ముంబై, ఢిల్లీలు అర్హత సాధించాయి. డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు    ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ఫైనల్ చేరిన జట్టుతో తుది పోరులో ఢీకొంటుంది.  ఓడిన జట్టు మూడో స్థానానికి పరిమితమవుతుంది.  మరి  ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే   రేపు (సోమవారం)  గుజరాత్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ లో యూపీ వారియర్స్ ఓడాలి. ఒకవేళ యూపీ గెలిస్తే మాత్రం మంధాన అండ్ కో. ఇక బ్యాగ్ సర్దుకోవడమే.. ఈనెల  24న ఎలిమినేటర్ (డీవై పాటిల్), 26న ఫైనల్ (బ్రబోర్న్) జరుగుతాయి.   ఈ లీగ్ ముగిసిన వెంటనే  మెన్స్ ఐపీఎల్ మొదలుకానుంది.