RCB vs GGW: 


వామ్మో..! ఓరి నాయనో!  ఏం కొట్టుడు భయ్యా ఇదీ! ఆఫ్‌సైడ్‌ లేదు.. లెగ్‌ సైడ్‌ లేదు.. స్ట్రెయిట్ లేదు..! బౌలర్‌ ఎక్కడన్నా వేయనీ నేను బాదేది సిక్సరే అన్నట్టుగా చెలరేగింది సోఫీ డివైన్‌ (99; 36 బంతుల్లో 9x4, 8x6). దాంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు లీగులోనే అతిపెద్ద టార్గెట్‌ను అత్యంత సునాయాసంగా ఛేదించింది. 15.3 ఓవర్లకే 2 వికెట్ల నష్టానికి 189 టార్గెట్‌ను ఉఫ్‌ అని ఊదేసింది. 8 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (37; 31 బంతుల్లో 5x4, 1x6) రాణించింది. అంతకు ముందు గుజరాత్‌లో ఓపెనర్‌ లారా వూల్‌వర్ట్‌ (68; 42 బంతుల్లో 9x4, 2x6) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ బాదేసింది. యాష్లే గార్డ్‌నర్‌ (41; 26 బంతుల్లో 6x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడేసింది.


స్టాండ్స్‌లోకి బంతులు!


ఆర్సీబీ అంటే ఇదీ! అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేసింది ఇదీ! స్టార్లు  కొట్టాల్సిన తీరు ఇదీ! గెలిచే పద్ధతి ఇదీ! విమెన్‌ ప్రీమియర్ లీగులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అద్వితీయ ఛేదన చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓపెనర్లు సోఫీ డివైన్‌, మంధాన తొలి వికెట్‌కు ఏకంగా 125 (57) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో ఓవర్‌ నుంచే డివైన్‌ ఊచకోత మొదలు పెట్టింది. యాష్లే గార్డ్‌నర్‌ వేసిన ఈ ఓవర్లో వరుసగా 6,4,4,6,4 దంచింది. మరోవైపు స్మృతి సైతం ఫామ్‌ అందుకోవడంతో ఆర్సీబీ 6 ఓవర్లకే 77 పరుగులు చేసింది. 8 ఓవర్లకు 100ను చేరుకుంది.


99 వద్ద ఔట్‌


కన్వర్‌ వేసిన 9వ ఓవర్లోనూ డివైన్‌ మూడు సిక్సర్లు, ఒక బౌండరీతో 25 రన్స్‌ సాధించింది. అయితే 9.2వ బంతికి మంధానను స్నేహ రాణా ఔట్‌ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. అయినా డివైన్‌ దంచుడు ఆపలేదు. 11.1 ఓవర్లకే స్కోరును 150కి చేర్చింది. 20 బంతుల్లో 50 కొట్టిన డివైన్‌ ఇదే దూకుడుతో 35 బంతుల్లోనే 99కి చేరుకుంది. సింగిల్‌ తీసి సెంచరీ చేస్తే బాగుండేది. కానీ యాష్ గార్త్‌ ఆఫ్‌సైడ్‌  వేసిన 11.5వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి గాల్లోకి లేపింది. ఫ్లాట్‌గా వెళ్లిన బంతిని అశ్విని గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకుంది. ఆ తర్వాత ఎలిస్‌ పెర్రీ (19*), హీథర్‌ నైట్‌ (22*) జట్టుకు విజయం అందించారు.




దంచిన  లారా!


మొదట బ్యాటింగ్‌ తీసుకుందే బాదడానికి అన్నట్టుగా ఆడింది గుజరాత్‌! మొదటి ఓవర్‌ నుంచే ఓపెనర్లు సోఫియా డాంక్లీ (16), లారా వూల్‌వర్ట్‌ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే జట్టు స్కోరు 27 వద్ద సోఫియాను డివైన్‌ బౌల్డ్‌ చేసింది. ఆ తర్వాత సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4x4) అండతో లారా రెచ్చిపోయింది. తనను వేలంలో ఎవరూ కొనలేదేమోనన్న కసో ఏంటో ఆకాశమే హద్దుగా చెలరేగింది. పవర్‌ప్లే ముగిసే సరికి 45/1తో నిలిపింది. రెండో వికెట్‌కు 55 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తెలుగమ్మాయి మేఘన సైతం కొన్ని చక్కని షాట్లు ఆడింది. ప్రీతి బోస్‌ బౌలింగ్‌లో ఆమెను రిచా స్టంపౌట్‌ చేసింది. అప్పటికి గుజరాత్‌ స్కోరు 90.


గార్డ్‌నర్‌ మెరుపులు


మేఘన ఔటైనా బెంగళూరు కష్టాలు తీరలేదు. యాష్లే గార్డ్‌నర్‌, లారా ఇద్దరూ బాదుడు షురూ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 52 పరుగులు భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ ఎడాపెడా బాదేయడంతో 17.4 ఓవర్లకు జట్టు స్కోరు 150కి చేరింది. అయితే 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన లారాను అంతకు ముందే శ్రేయాంక పాటిల్‌ ఔట్‌ చేసింది. గార్డ్‌నర్‌ను సైతం ఆమే ఎల్బీ చేసింది. ఆఖర్లో హేమలత (16; 6 బంతుల్లో 2x4, 1x6), హర్లీన్‌ డియోల్‌ (12; 5 బంతుల్లో 1x4, 1x6) బౌండరీలు, సిక్సర్లు బాదడంతో స్కోరు 188/4కు చేరింది.