IND vs AUS 2nd ODI: 


క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌! భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే సజావుగా సాగడం కష్టమే! ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచివుంది. ఆదివారం విశాఖ పట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే.


చాలా రోజుల తర్వాత విశాఖపట్నంలో అంతర్జాతీయ వన్డే జరుగుతోంది. ఇది టీమ్‌ఇండియాకు అచ్చొచ్చిన మైదానం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దీనిని సెంటిమెంటుగా భావిస్తాడు. రెండో వన్డే గెలిచి 2-0తో సిరీసును కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.


మధ్యాహ్నం ఒంటిగంటకు మ్యాచ్‌ టాస్‌ వేస్తారు. ఒకటిన్నర గంటలకు ఆట మొదలవుతుంది. వరుణుడు ఆద్యంతం అంతరాయాలు కల్పించే అవకాశం ఉంది. ఆదివారం భారీ వర్షం కురిసేందుకు 31-51 శాతం వరకు అవకాశం ఉందని వాతావరణ శాఖ, వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు వర్షంతో మ్యాచ్‌ ఆగిపోవచ్చని అంటున్నారు.


ఆదివారం విశాఖలో 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. రాత్రికి ఇది 23 డిగ్రీలకు తగ్గనుంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులు కనిపిస్తాయని అంటున్నారు. ఉదయం 80 శాతం, రాత్రి 49 శాతం వర్షం కురిసేందుకు అవకాశం ఉంది.


శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. 1-0తో సిరీసులో పైచేయి సాధించింది. దాంతో విశాఖ వన్డేపై హిట్‌మ్యాన్‌ సేన దృష్టి సారించింది. పైగా తొలి వన్డేకు దూరమైన రోహిత్‌ శర్మ తిరిగొస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌ స్థానం తీసుకోనున్నాడు.


IND vs AUS, 1st ODI: తొలి వన్డేలో ఏం జరిగిందంటే?


ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా సూపర్‌ డూపర్‌ విక్టరీ సాధించింది. వాంఖడేలో దుమ్మురేపింది. మూడు మ్యాచుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సాధికారికంగా ఛేదించింది. సీమ్‌, స్వింగ్‌తో ఆసీస్‌ పేసర్లు వణికించిన వేళ.. ఓడిపోతామేమోనని ఆందోళన చెందిన వేళ.. కేఎల్‌ రాహుల్‌ (75; 91 బంతుల్లో 7x4, 1x6) నిలబడ్డాడు. తనకిష్టమైన ముంబయిలో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రవీంద్ర జడేజా (45; 69 బంతుల్లో 5x4) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు ఆసీస్‌లో మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో 10x4, 5x6) ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్‌ షమి, సిరాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.


టాప్‌ ఆర్డర్‌.. టపటపా!


వాంఖడేలో ఛేదనంటే గుర్తొచ్చేదేంటి! మంచు కురుస్తుంది కాబట్టి ఎంతటి టార్గెట్టైనా ఈజీగా ఛేజ్‌ చేయొచ్చు! కానీ ఈసారి అలా ఏం జరగలేదు! పిచ్‌, కండిషన్స్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించాయి. దాంతో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌ (3/49), మార్కస్‌ స్టాయినిస్‌ (2/27) బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఐదు పరుగుల వద్దే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3)ను స్టాయినిస్‌ ఎల్బీ చేశాడు. ఐదో ఓవర్లో వరుస బంతుల్లో విరాట్‌ కోహ్లీ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (0)ను మిచెల్‌ స్టార్క్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చక్కని లెంగ్తుల్లో బంతులేశాడు. ఈ సిచ్యువేషన్లో కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌ (20; 31 బంతుల్లో 3x4) చిన్న భాగస్వామ్యం నెలకొల్పారు. 38 వద్ద గిల్‌ను స్టార్క్‌ ఔట్‌ చేయడంతో టీమ్‌ఇండియా ఒత్తిడికి గురైంది.


జడ్డూ అండగా రాహుల్‌ టాప్‌ క్లాస్‌!


కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. రాహుల్‌ తనదైన రీతిలో బంతుల్ని డిఫెండ్‌ చేశాడు. పరిస్థితులకు తగ్గట్టు బంతులేస్తున్న బౌలర్లను గౌరవించాడు. అనవసర షాట్లు ఆడలేదు. మరోవైపు పాండ్య కాస్త దూకుడుగా ఆడాడు. పిచ్‌ ఈజీగా ఉన్నట్టు ప్రవర్తిస్తూ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఐదో వికెట్‌కు 55 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని జట్టు స్కోరు 83 పాండ్యను ఔట్‌ చేయడం ద్వారా స్టాయినిస్‌ విడదీశాడు. ఇక్కడ్నుంచి కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా తమ అసలైన ఆటతీరును బయటకు తీశారు. ఆఫ్‌సైడ్‌ స్వింగ్‌ అవుతున్న బంతుల్ని వదిలేశారు. చెత్త బంతుల్ని మాత్రమే వేటాడారు. సింగిల్స్‌, డబుల్స్‌ రొటేట్‌ చేశారు. జట్టు స్కోరు 100 దాటించారు. ఆపై 150ని అధిగమించారు. 73 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాక కేఎల్‌ కొన్ని బౌండరీలు బాదడంతో గెలుపు ఖాయమైంది. జడ్డూ సైతం బాగా ఆడటంతో ఈ జోడీ 123 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. 61 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలిపించింది.