MI vs UPW:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ఇప్పటి వరకు అజేయమైన జట్టు ముంబయి ఇండియన్స్‌! భీకరమైన బ్యాటర్లు వారి సొంతం. అలాంటి టీమ్‌ను యూపీ వారియర్జ్‌ స్పిన్నర్లు వణికించేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్‌ (3/15), రాజేశ్వరీ (2/16), దీప్తి (2/35) దెబ్బకు హర్మన్‌సేన విలవిల్లాడింది. 20 ఓవర్లకు 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్‌ (35; 30 బంతుల్లో 1x4, 3x6), ఇస్సీ వాంగ్‌ (25; 19 బంతుల్లో 4x4, 1x6) టాప్‌ స్కోరర్లు.




గింగిరాలు తిప్పేశారు!


మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు మంచి ఓపెనింగే లభించింది. ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ నిలకడగా ఆడింది. యస్తికా భాటియా (7)తో కలిసి తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించింది. 4.5వ బంతికి యస్తికను అంజలీ శర్వాణీ ఔట్‌ చేసి బ్రేకిచ్చింది. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ముంబయి 31/1తో నిలిచింది. ఆ తర్వాత నాట్‌ సివర్‌ (5) ఎకిల్‌ స్టోన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. కీలకంగా మారిన హేలీని జట్టు స్కోరు 57 వద్ద పెవిలియన్‌కు పంపించింది.




హర్మన్‌, వాంగ్‌ పోరాటం


ఈ సిచ్యువేషన్లో కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (25; 22 బంతుల్లో 3x4) నిలబడింది. అమెలియా కెర్‌ (3)ను రాజేశ్వరి ఔట్‌ చేసినప్పటికీ ఇస్సీ వాంగ్‌తో కలిసి పోరాడింది. దాంతో 9.5 ఓవర్లకు ఎంఐ 50 పరుగుల మైలు రాయి చేరుకుంది. 14వ ఓవర్లో హర్మన్‌ను దీప్తి శర్మ ఔట్‌ చేయగానే ముంబయి స్కోరువేగం తగ్గిపోయింది. అనమ్‌జోత్‌ కౌర్‌ (5), హమైరా కాజి (4), ధారా గుజ్జర్‌ (3), సైకా ఇషాక్‌ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఇస్సీ వాంగ్‌ పోరాడటంతోనే ముంబయి 127కు చేరుకుంది.