Sachin Tendulkar: ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు శాసించిన టెస్టు క్రికెట్‌కు ప్రత్యేక స్థానముంది. అయితే  వన్డే ఫార్మాట్ (మొదట 60 ఓవర్లు)ను తీసుకొచ్చాక  టెస్టు క్రికెట్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. వన్డే క్రికెట్‌లో నిబంధనల సవరణ, ఈ ఫార్మాట్‌కు ఉన్న క్రేజ్ వల్ల ఇది కూడా సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఒక ఊపు ఊపింది. 1970ల నుంచి 2010వ దశకం వరకూ వన్డేలదే హవా. కానీ టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో వన్డేలు మనుగడ  సాధించడమే కష్టమవుతోంది. మరీ ముఖ్యంగా గడిచిన నాలుగైదేండ్లలో వన్డేలు క్రమంగా అంతరించే దశకూ చేరుకున్నాయి.  


మారుతున్న కాలానికి అనుగుణంగా వన్డే క్రికెట్ లో కూడా మార్పులు చేయాలని కొంతకాలంగా  అంతర్జాతీయ క్రికెట్ లో కూడా చర్చ జోరుగా  సాగుతోంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. వన్డేలను 50 ఓవర్లుగా కాకుండా 40 ఓవర్లకు కుదించాలని  అభిప్రాయపడ్డాడు. తాజాగా  ఇదే విషయమై  టీమిండియా దిగ్గజ క్రికెటర్.. వన్డేలలో మరెవరి పేరిట లేని రికార్డులను నెలకొల్పిన మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్ లో కూడా మార్పులు అవసరమని.. లేకుంటే వన్డేల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని  ఆందోళన వ్యక్తం చేశాడు. 


మరీ బోర్ కొడుతున్నాయి.. : సచిన్


ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న  సచిన్   మాట్లాడుతూ.. ‘గత కొన్నాళ్లుగా వన్డే క్రికెట్ లో ఎలాంటి మార్పులూ రావడం లేదు.  వన్డే క్రికెట్ ను బతికించుకోవాలంటే  మార్పులు తప్పనిసరి. నిబంధనల ప్రకారం రెండు కొత్త బంతులను (ఇన్నింగ్స్ కు ఒకటి) తీసుకోవడం వల్ల వాటిని రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడం లేదు. ఈ కారణంగా మ్యాచ్ 15 ఓవర్ నుంచి  40వ ఓవర్ వరకూ  మ్యాచ్ లు బోర్ కొడుతున్నాయి. అందుకే  టెస్టులలో మాదిరిగా  వన్డే ఫార్మాట్ నూ  రెండు ఇన్నింగ్స్ (ప్రతీ 25 ఓవర్లకు ఒకటి)లుగా విడదీసి ఆడించాలి.   అప్పుడు ఆట రసవత్తరంగా సాగుతుంది. అంతేగాక వాణిజ్యపరంగా కూడా కలిసొస్తుంది...’అని తెలిపాడు. 


కాగా వన్డే క్రికెట్ లో సచిన్ కు  లెక్కకు మిక్కిలి రికార్డులున్నాయి.  తన  ఇరవై ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో సచిన్.. 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు.   49 సెంచరీలు కూడా చేశాడు. ఈ రికార్డుల దరిదాపుల్లో కూడా ఏ క్రికెటర్ లేడు.  విరాట్ కోహ్లీ సచిన్ వన్డే సెంచరీల  వైపునకు దూసుకొస్తున్నా (46) పరుగులలో సచిన్ ను దాటడం అంత ఈజీ కాదు.  అలాంటి టెండూల్కరే వన్డేలలో మార్పులను  సూచించడం గమనార్హం. 


కొన్నాళ్లుగా చర్చ.. 


వన్డే క్రికెట్ లో మార్పులను కోరుతూ గత కొంతకాలంగా  చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్  స్టోక్స్ గతేడాది అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకోవడంతో ఈ చర్చ మరింత పెరిగింది.   టీ20లతో పాటు టెస్టు క్రికెట్ కూ ఆదరణ పెరుగుతుండగా  వన్డేలు ఆడేందుకు ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపడం లేదన్న వాదనలూ వినిపించాయి.