Elephant Electrocuted Video : ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ధర్మపురిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల్లో వెళ్తున్న ఏనుగుకు విద్యుత్ వైర్లు తగలడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలు స్థానికులు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. స్థానికుల సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు. వేటగాళ్లు అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారా లేక పొరపాటున విద్యుత్ తీగలు తెగి ఏనుగుకు తగలడంతో మృతి చెందిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 7న తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి. 






మారండహళ్లిలో మూడు ఏనుగులు మృతి


తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా, మారండహళ్లి సమీపంలోని కలికౌండన్‌కోట్టై గ్రామానికి చెందిన మురుగేషన్ (50) తన 2 ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, రాగులు, కొబ్బరి పంటలు సాగుచేశాడు. రాత్రి వేళల్లో ఏనుగులు, అడవి పందుల బెడదతో తన వ్యవసాయ భూమిలో అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చాడు. ఇటీవల... రాత్రి ఆహారం, నీరు వెతుక్కుంటూ వచ్చిన 5 ఏనుగులు తీగకు చిక్కుకోగా మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు ప్రాణాలతో బయటపడ్డాయి. 5 ఏనుగుల గుంపులో మూడు ఏనుగులు విద్యుత్ షాక్ తో మృతి చెందగా మరో రెండు ఏనుగులు మృతి చెందిన ఏనుగుల వద్దే తిరుగుతున్న దృశ్యాలు స్థానికులను కలచివేశాయి. గత ఏడాది సైతం ఇదే ప్రాంతంలో ఓ ఏనుగు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. రాయకోట ఫారెస్ట్ అధికారులు రైతు మురుగేషన్‌ పై అటవీ శాఖా చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతి చెందిన ఏనుగులకు శవపరీక్షలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు.


అక్రమ విద్యుత్ కంచె 


 మారండహళ్లిలోని ఒక గ్రామానికి సమీపంలో అక్రమ విద్యుత్ కంచెలో చిక్కుకుని రెండు ఆడ ఏనుగులు, ఒక మగ ఏనుగు మరణించాయి. అయితే ఫారెస్ట్ స్క్వాడ్ విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో సమూహంలోని రెండు ఏనుగు పిల్లలను రక్షించారు. విద్యుత్ వైర్‌ను సిబ్బంది డిస్‌కనెక్ట్ చేశారు. ధర్మపురిలోని కెందనహళ్లిలోని కాళీ కవుందర్ కొట్టాయ్ గ్రామంలో సోమవారం రాత్రి 10.30 గంటలకు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. మారండహళ్లిలో మూడు పెద్ద ఏనుగులు, రెండు పిల్లలు కూడిన గుంపు పంట పొలాల వైపు వచ్చాయి.  అటవీ శాఖ ఆ గుంపు దారిని మళ్లించేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే ఇంతలోనే ప్రమాదం జరిగిందన్నారు. మా సిబ్బంది వచ్చే సరికి మూడు ఏనుగులు నేలపై పడివున్నాయి, రెండు పిల్ల ఏనుగులు వాటి చుట్టూ తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు. పెద్ద ఏనుగుల వయస్సు దాదాపు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. విద్యుత్ వైర్ ఒక అడుగున్నర ఎత్తులో ఒక చెక్క కర్రకు పొలం చుట్టూ కట్టారు. ఆ విద్యుత్ వైర్ కు అక్రమంగా కనెక్షన్ ఇచ్చారని డీఎఫ్ఓ  నాయుడు తెలిపారు. ఈ ప్రమాదం 9 నెలల లోపు వయస్సు గల రెండు పిల్ల ఏనుగులకు విషాదం మిగిల్చింది. అవి ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతూ రోధించిన తీరు గ్రామస్థులను కలచివేసింది. చనిపోయిన తల్లులకు దగ్గరే ఆ రెండు పిల్లలు ఉండిపోయాయి.  ఆ పిల్ల ఏనుగులను వేరే సమూహంతో కలపడానికి ప్రయత్నిస్తామని డీఎఫ్ఓ అన్నారు.