AIADMK Leadership Tussle:
ఆ తీర్పుని పక్కన పెట్టేసి..
తమిళనాడులో పనీర్ సెల్వం, పళనిస్వామి మధ్య యుద్ధం ఆగటం లేదు. రెండు, మూడు నెలలుగా ఇది కొనసాగుతూనే ఉంది. AIDMK జనరల్ సెక్రటరీ పదవిపై చెలరేగిన వివాదం ముదిరి చివరకు కోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్ట్ మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పార్టీ నాయకత్వ వివాదంపై అన్నాడీఎంకే లీడర్ పళనిస్వామి కోర్టులో అప్పీల్ వేయగా...దీన్ని కోర్టు అనుమతించింది. అంతకు ముందు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. జులై 11న జరిగిన AIDMK జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పుని...జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ తోసి పుచ్చింది. ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో...అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు పళనిస్వామికే అందనున్నాయి. మొత్తానికి...మాజీ డిప్యుటీ సీఎం పనీర్ సెల్వంకు షాక్ తగిలింది.
అంతకు ముందు ఏం జరిగిందంటే..?
అన్నా డీఎంకే పార్టీకి ఆగస్టు 17న మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. జులై 11వ తేదీన జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లదని, మరోసారి ఈ సమావేశం నిర్వహించాలని తేల్చి చెప్పింది. కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్‌కు మాత్రమే జనరల్ కౌన్సిల్ నిర్వహించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వమ్ వేసిన పిటిషన్‌పై చేపట్టిన విచారణలో భాగంగా..ఈ వ్యాఖ్యలు చేసింది. తనను పార్టీ నుంచి బహిష్కరించటమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించటాన్ని హైకోర్ట్‌లో సవాలు చేశారు పన్నీర్‌సెల్వం. జులై 11వ తేదీన జరిగిన ఈ సమావేశంలో...పన్నీర్‌సెల్వంని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించటంతో పాటు, ట్రెజరర్ పోస్ట్ నుంచి కూడా తప్పిస్తున్నట్టు తీర్మానం పాస్ చేశారు. ఆయన స్థానంలో పళనిస్వామి AIDMK తాత్కాలిక జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. ఈ నిర్ణయం తరవాత తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ అల్లర్ల కారణంగా...పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మూసేశారు.
ఎత్తులకు పై ఎత్తులు..
పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలని నిర్ణయించడంతో ఎక్కువ మంది పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. దీంతో రెండు నెలల క్రితం ఓ సమావేశం మధ్యలోనే పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో వాకౌట్ చేశారు. అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపునకు నీళ్ల సీసాలు విసిరారు. బయట పన్నీర్ సెల్వం కారు టైర్లో గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళం తరవాతే...జులై 11న మరోసారి మీటింగ్ పెట్టుకున్నారు. తరవాత అది కూడా చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పు పన్నీర్ సెల్వంకి మింగుడు పడేలా లేదు.
Also Read: Pappu Charu Uppu Chepa : శ్రీకాకుళం జిల్లాలో ఈ గ్రామం పేరు చెబితే నోరూరాల్సిందే..! | DNN | ABP Desam