ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో లంక గెలిచింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 కు అర్హత సాధించింది. ఆడిన రెండు గేమ్ లలో ఓడిన బంగ్లా ఇంటిబాట పట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆఫిఫ్ హొస్సేన్ 39 పరుగులు, హసన్ మిరాజ్ 38 పరుగులతో రాణించారు. షకీబుల్ హసన్ (24), మహ్మదుల్లా (27), మొసద్దిక్ హొస్సేన్(24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ, చమిక కరుణరత్నే రెండేసి వికెట్లు పడగొట్టారు. మదుశంక, మహేశ్ తీక్షణ, అషిత ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు.
184 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాంక, కుశాల్ మెండిస్ శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో లంక నిశాంక, వన్ డౌన్ బ్యాటర్ చరిత్ అసలంక వికెట్లు కోల్పోయింది. అయితే మెండిస్ మాత్రం బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. అయితే మిగిలిన బ్యాట్స్ మెన్ అంతగా రాణించలేకపోవటంతో లంక కష్టాల్లో పడింది. చివర్లో దసున్ శనక 45 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేశాడు. 17వ ఓవర్లో అతను ఔటయ్యాడు.
చివర్లో ఉత్కంఠ
చివరి 2 ఓవర్లలో విజయానికి 25 పరుగులు అవసరమైన వేళ లంక మ్యాచ్ గెలవడం కష్టమే అనిపించింది. అయితే 19వ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయిన లంక 17 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సిరాగా తొలి బంతికి ఒక పరుగు వచ్చింది. రెండో బంతికి ఫెర్నాండో ఫోర్ కొట్టాడు. మూడో బంతికి నో బాల్ సహా 3 పరుగులు రావటంతో లంకను విజయం వరించింది. బంగ్లా బౌలర్లలో హొస్సేన్ 3 వికెట్లతో రాణించాడు.
ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 లో అడుగుపెట్టింది. గ్రూప్- బీ నుంచి ఇప్పటికే అఫ్ఘనిస్థాన్ సూపర్- 4 కు క్వాలిఫై అయ్యింది. గ్రూప్- ఏ నుంచి భారత్ సూపర్- 4 కు చేరుకుంది. ఇంక పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఎవరు క్వాలిఫై అవుతారో తెలియాల్సి ఉంది.