Ahmednagar Bogus Doctor: హీరో అల్లరి నరేశ్ నటించిన 'బెండు అప్పారావు' సినిమా గుర్తుందా? అందులో జనాలకు లేని రోగాలను ఉన్నట్లు చూపించి డబ్బులు గుంజేస్తాడు హీరో. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇక్కడి బోగస్ డాక్టర్ ఏకంగా 40 మంది రోగులకు పశువుల ఇంజెక్షన్ ఇచ్చేశాడు.
ఇదీ జరిగింది
మహారాష్ట్రలో ఓ బోగస్ డాక్టర్ చేసిన ఈ నిర్వాకం ఆలస్యంగా బయటకొచ్చింది. వైద్యుడినని చెప్పుకునే ఓ వ్యక్తి జంతువులకు ఇచ్చే ఇంజెక్షన్లను మనుషులకు వేశాడు. అహ్మద్‌నగర్‌లోని పథర్డి తాలూకా ఖండోబావాడిలో ఈ ఘటన జరిగింది.
ఈ బోగస్ డాక్టర్ 40 మందికి పైగా మహిళలు, పురుషులకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ బోగస్ డాక్టర్ పేరు రాజేంద్ర జవాంజలేగా పోలీసులు గుర్తించారు.
ఇలా దొరికేశాడు
రాజేంద్ర గత రెండు రోజులుగా కరంజి సమీపంలోని ఖండోబావాడికి వైద్యుడిగా వచ్చాడు. అక్కడున్న కొందరికి మెడ, మోకాళ్లు, నడుము నొప్పులకు చికిత్స చేస్తున్నట్లు ఇంజెక్షన్లు ఇచ్చాడు. నొప్పులున్న చోటే ఇంజెక్షన్ ఇచ్చి ఒక్కొక్కరి నుంచి ఐదు వందల రూపాయలు దండుకున్నాడు.
అయితే ఈ బోగస్ వైద్యుడిపై గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు అనుమానం వచ్చింది. డాక్టర్ బ్యాగులో ఉన్న ఇంజెక్షన్ బాటిళ్లను పరిశీలించగా.. ఆ బాటిళ్లపై జంతువుల గుర్తులు కనిపించాయి. వెంటనే అతడ్ని పట్టుకుని తీస్‌గావ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బాబాసాహెబ్ హోద్‌షీల్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఈ బోగస్ డాక్టర్‌పై పథర్డి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ బోగస్ డాక్టర్ బ్యాగ్‌లో ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ బోగస్ వైద్యుడు గత రెండు రోజులుగా గ్రామంలోని ప్రజలకు ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
ఆరోగ్య శాఖ
ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది. బోగస్ వైద్యుడి నుంచి చికిత్స పొందిన వారికి పరీక్షలు చేయిస్తోంది. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆరోగ్య శాఖను సంప్రదించాలని అధికారులు కోరారు. అలాగే ఈ విధంగా బోగస్ వైద్యులెవరైనా కనిపిస్తే ఆరోగ్య శాఖకు తెలియజేయాలన్నారు.
Also Read: RBI on Loan Apps: లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్- RBIకు కీలక ఆదేశాలు!
Also Read: Bharat Jodo Yatra: క్లారిటీగా ఉన్నానంటూ వెయిటింగ్‌లో పెట్టిన రాహుల్ గాంధీ!