కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ లో ఇంటి బాడుగ చెల్లించలేదంటూ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇంటి యజమాని తాళం తాళం వేసిన ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని నాగలకట్ట వీధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇంటి యజమాని తాళం వేశారు. దీనితో ఆరోగ్య కేంద్ర సిబ్బంది రోడ్డుపైనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదు నెలల నుంచి ఇంటికి రెంటు చెల్లించక పోగా, కరెంటు బిల్లులు కూడా కట్టడం లేదని తెలిపారు. గత కొంత కాలంగా ఈ విషయాన్ని వైద్యాధికారులకు చెబుతున్నా.. వారు సరిగ్గా స్పందించడం లేదని అన్నారు. అందుకే పీహెచ్ సీకి తాళం వేసినట్లు వివరించారు.
ప్రభుత్వం సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక నడిరోడ్డుపైనే రోగులకు చికిత్స అందజేస్తుమన్నారు. సరైన సమయంలో నిధులు ఇవ్వడమో లేదంటే.. పీహెచ్ సీని నిర్మించడమో చేయాలని వైద్యులు కోరుతున్నారు.
ఈ మధ్య కరీంనగర్‌లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. మన ఊరు-మన బడి పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశాడు. కరీంనగర్ జిల్లాలో మరో కాంట్రాక్టర్ తన ప్రతాపం చూపించాడు. బిల్లులు కట్టడం లేదంటూ ఒక రోజు కిందటే కొత్తపల్లిలో ఒక కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేయగా అదే విధంగా మరో కాంట్రాక్టర్ తాళం వేసి తన నిరసన తెలిపాడు. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ తదితర పనుల కోసం రూ.ఐదు లక్షలకుపైగా టెండర్ ను సురేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకొన్నాడు. జూన్ నెలలో కొంత వరకు పనులు పూర్తి చేశాడు. అయితే ఇప్పటి వరకు పైసా చెల్లించలేదని, దాదాపుగా మూడు లక్షల అప్పు తెచ్చి పనులు పూర్తి చేశారని, ఇప్పటి వరకూ పైసా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. ఇబ్బందులు పడుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగా స్కూల్ కి వచ్చి తాళం వేయడంతో విద్యార్థులు పాఠశాల సిబ్బంది కంగుతిన్నారు. అయితే మొదట ఇదే పని చేసినా కొత్తపల్లి కాంట్రాక్టర్ పై పోలీసు కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు పాఠశాల సిబ్బంది. తాము ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇలా చేయడం తప్ప వేరే దారి లేదంటూ కాంట్రాక్టర్లు తిరుగుబాటు చేస్తున్నారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.